సూపర్-8కు అమెరికా
కెనడా-భారత్ జట్ల మధ్య శనివారం జరగాల్సిన గ్రూప్-ఏ మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. దీంతో ఈ గ్రూప్ నుంచి భారత్‌తో పాటు ఆతిథ్య అమెరికా టీమ్ సూపర్-8కు అర్హత సాధించాయి.
మ్యాచ్ ఆరంభానికి ముందు భారీ వర్షం కురవడంతో సెంట్రల్ పార్క్ స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షంతో స్టేడియం తడిసి ముద్దయ్యింది.
మైదానం మొత్తం వర్షం నీరుతో నిండిపోయింది. తర్వాత వర్షం తగ్గు ముఖం పట్టినా ఫలితం లేకుండా పోయింది. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో కనీసం టాస్ కూడా వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.
ఫ్లోరిడా వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కానీ వర్షం వీరి ఆశలపై నీళ్లు చల్లింది. భారీ వర్షం వల్ల మైదానం చెరువును తలపించింది.
అయితే స్టేడియాన్ని మ్యాచ్‌కు సిద్ధం చేసేందుకు గ్రౌండ్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పలు సార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు చివరికీ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
దీంతో భారత్, కెనడా జట్లకు చెరో పాయింట్ లభించింది. కాగా, గ్రూప్-ఏలో భారత్ ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించిన టీమిండియా ఇంతకు ముందే సూపర్- 8కు చేరిన విషయం తెలిసిందే. కెనడా, పాకిస్థాన్, ఐర్లాండ్ జట్లు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాయి.
మరోవైపు వర్షంతో మ్యాచ్ రద్దు కావడంతో నిరాశ చెందిన అభిమానులను టీమిండియా క్రికెటర్లు ఉత్సాహపరిచారు. వారితో కలిసి ఫొటోలు దిగుతూ స్టేడియమంతా కలియ తిరిగారు.