Pak Ex Prime Minister: ఓటుహక్కు, చట్టబద్ధ పాలన, నైతికత, స్వేచ్ఛాయుత మీడియా.. ఈ నాలుగు అంశాలకు ప్రజాస్వామ్యంలో ప్రాధాన్యం ఉంటుంది. వీటన్నింటినీ ఇటీవల చేసిన 26వ రాజ్యాంగ సవరణ నాశనం చేసిందని పాకిస్తాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran khan) ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో నిరంకుశ పాలన విధానాలను అమలు చేస్తున్నారని ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. అయితే ఈ బానిసత్వాన్ని అంగీకరించడం కంటే జైల్లో చీకటి గదిలోనే జీవించడానికి తాను ఇష్టపడతానని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తన సందేశాలను సైతం ప్రజలకు చేరకుండా అడ్డుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 6న పోరాడాలని పీటీఐ కార్యకర్తలు, తన మద్దతుదారులతో పాటు దేశ ప్రజలకు ఇమ్రాన్ పిలుపునిచ్చారు. నియంత అధికారంలోకి వస్తే ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో పాలన కొనసాగిస్తాడని పాక్ ఆర్మీ చీఫ్ (Pak Army Chief) ఆసిమ్ మునీర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రస్తుతం పాకిస్తాన్‌లో న్యాయ వ్యవస్థ దారుణంగా తయారైందని, కోర్టుల్లో స్వతంత్రంగా వ్యవహరించే న్యాయమూర్తులు శక్తిహీనులుగా మారడంతో ఎంపిక చేసిన వారే రాజ్యమేలుతున్నారని విమర్శించారు. వాక్ స్వాతంత్ర్యం కనుమరుగవడంతో పాటు నిజాయితీ గల జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదిలాఉంటే పలు హింసాత్మక ఘటనల్లో 2023లో అరెస్టయిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికీ లాహోర్ జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కోర్టులో ఈ మాజీ ప్రధానికి చుక్కెదురవుతోంది.