Friday, October 17, 2025

Buy now

Ind vs Eng: శతక్కొట్టిన శుభ్‌మన్‌

2nd Test: ఇంగ్లండ్‌ (England)తో బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు బుధవారం భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (Shubhman Gill) (216 బంతుల్లో 12 బౌండరీలతో 114 నాటౌట్‌) సెంచరీ చేయగా, ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (107 బంతుల్లో 13 బౌండరీలతో 87) రాణించాడు.

క్రీజులో గిల్‌తో పాటు రవీంద్ర జడేజా (67 బంతుల్లో 5 ఫోర్లతో 41 బ్యాటింగ్‌) ఉన్నాడు. ఇంగ్లీష్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ రెండు వికెట్లు పడగొట్టగా, బెన్‌స్టోక్స్‌, షోయబ్‌ బషీర్‌, బ్రైడన్‌ కార్స్‌ ఒక్కో వికెట్‌ తీశారు. అంతకుముందు టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు బౌలింగ్‌ ఎంచుకోవడంతో గిల్‌ సేన ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.

ALSO READ: https://prajanaava.in/imran-khan-fires-army-chief-asif-muneer/

ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (2) క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో అవుటవడంతో 15 పరుగులకే టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కరుణ్‌ నాయర్‌తో కలిసి యశస్వీ జైస్వాల్‌ (Yashasvi Jaiswal) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఆది నుంచి ఇంగ్లీష్‌ బౌలర్లపై విరుచుకుపడ్డ జైస్వాల్‌ 59 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తిచేశాడు.

మరో ఎండ్‌లో జైస్వాల్‌కు చక్కని సహకరం అందించిన కరుణ్‌ నాయర్‌ (31) పరగుల వద్ద బ్రైడన్‌ కార్స్‌ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరడంతో 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ వచ్చిన కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ నెమ్మదిగా ఆడుతూ పరుగులు రాబట్టారు. దీంతో లంచ్‌ సమయానికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.

జైస్వాల్‌ మిస్‌.. గిల్‌ సెంచరీ
లంచ్‌ తర్వాత ప్రారంభమైన రెండో సెషన్‌లో జైస్వాల్‌ తన జోరును మరింత పెంచగా.. మరోవైపు కెప్టెన్‌ గిల్‌ పూర్తి సహకారం అందించాడు. ఈ క్రమంలో సెంచరీ దిశగా సాగిన జైస్వాల్‌ను స్టోక్స్‌ అవుట్‌ చేయడంతో త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

మరోవైపు టీమిండియా మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యానికి స్టోక్స్‌ తెరదించాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ వచ్చీరాగానే తనదైన దూకుడు ప్రదర్శించాడు. ఓవైపు కెప్టెన్‌కు సహకరిస్తూనే మరోవైపు తన మార్క్‌ ఆటతీరును ప్రదర్శించాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించిన పంత్‌ (25) ఈ మ్యాచ్‌లో మాత్రం ఒక బౌండరీ, సిక్సర్‌ సాధించాడు.

మరో సిక్సర్‌ కొట్టే క్రమంలో బషీర్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ అవుట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన తెలుగు కుర్రోడు నితీష్‌ కుమార్‌ (1) నిరాశ పరిచాడు. క్రిస్‌ వోక్స్‌ వేసిన అద్భుతమైన డెలివరీకి నితీష్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికీ భార్‌ స్కోర్‌ 211 మాత్రమే. ఈ క్రమంలో కెప్టెన్‌కు జత కలిసిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా నెమ్మదిగా ఆడుతూ ఇంగ్లండ్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు.

ఈ క్రమంలోనే కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ 199 బంతుల్లో బౌండరీ ద్వారా సెంచరీ పూర్తిచేసుకున్నాడు. గిల్‌కు ఈ సిరీస్‌లో ఇది రెండో సెంచరీ కాగా, ఓవరల్‌గా ఏడోది. మరోవైపు రవీంద్ర జడేజా సైతం అర్ధ సెంచరీకి చేరులో ఉన్నాడు. అప్పటికే సమయం ముగియడంతో టీమిండియా తొలిరోజు ఐదు వికెట్లు కోల్పోయి 310 పరగులు చేసింది.

Related Articles

spot_img

Most Popular