జగిత్యాల :మాదకద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తును, సమాజ శ్రేయస్సును తీవ్రంగా దెబ్బతీస్తున్న నేపథ్యంలో వాటి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న “యాంటీ డ్రగ్స్ 3కే రన్” పోస్టర్‌ను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన అనేది ఒక్క శాఖ లేదా సంస్థ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని అన్ని వర్గాల సమిష్టి కృషితోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని అన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలన జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశమని, ఈ దిశగా ఐఎంఏ జగిత్యాల చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు, ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో యాంటీ డ్రగ్స్ 3కే రన్‌లో పాల్గొని మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.“Live Strong – Stay Free – Say No To Drugs” అనే నినాదంతో నిర్వహించనున్న ఈ యాంటీ డ్రగ్స్ 3కే రన్ యువతలో ఆరోగ్యకర జీవనశైలిపై చైతన్యం కల్పించడంతో పాటు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన పెంపొందించనుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఏ జగిత్యాల అధ్యక్షులు డా. గుడూరి హేమంత్, కార్యదర్శి డా. ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి డా. కోటగిరి సుధీర్ కుమార్, డా. గడ్డం వేణుగోపాల్ రెడ్డి, చింతా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

