పెద్దపల్లి: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘జెండా పండుగ’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు.ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పార్టీ జిల్లా ఇంఛార్జీ సలేంద్ర కొమరయ్య యాదవ్ పిలుపునిచ్చారు.
ఈ మేరకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు మంథని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలుకనున్నట్లు తెలిపారు.
అనంతరం కవిత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. తదుపరి స్థానిక వ్యాపారులను ప్రోత్సహించే ఉద్దేశంతో మిలాన్ స్వీట్ హౌస్‌ను సందర్శించి స్వీట్లు కొనుగోలు చేయడంతో పాటు వ్యాపారులతో మమేకమవుతారని వివరించారు. అనంతరం జెండా చౌరస్తాలో టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ప్రసంగిస్తారని తెలిపారు.
అక్కడి నుంచి పెద్దకాల్వ బస్టాండ్ చౌరస్తాకు చేరుకుని మరోసారి పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ధూళికట్టకు బయలుదేరుతారని చెప్పారు. పర్యటన సందర్భంగా ప్రజలతో మమేకమవుతూ పార్టీ భావజాలాన్ని, ఉద్యమ లక్ష్యాలను కవిత ప్రజలకు వివరిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, రాష్ట్ర హక్కుల పరిరక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘జెండా పండుగ’ కార్యక్రమానికి ప్రజలు, పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని సలేంద్ర కొమరయ్య యాదవ్ కోరారు. ‘కవిత పర్యటనతో పెద్దపల్లి నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపబడుతుందని, ఉద్యమ స్ఫూర్తి మరింత బలోపేతం అవుతుందని‘ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

