* ఈ ఏడాది 64 వేల మంది విద్యార్థులకు ప్రీ ప్రైమరీ విద్య
* విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు వెల్లడి
హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో చిన్న వయస్సు నుంచే విద్యను ప్రారంభించే అవకాశం ఉండటంతో తల్లిదండ్రులు ఆ పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నర్సరీ, ఎల్‌కేజీ విద్యతో పాటు ఇంగ్లిష్ భాషకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఇందుకు ఒక కారణమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారిగా ప్రీ ప్రైమరీ విధానాన్ని ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 64 వేల మంది విద్యార్థులకు ప్రీ ప్రైమరీ విద్య అందిస్తున్నట్లు వెల్లడించారు.నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన అల్పాహారం, భోజనం అందించేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు పోషకాహారం అందించడంపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం విద్యార్థులకు సంబంధించిన డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలను పెంచినట్లు సీఎం తెలిపారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చేపడుతున్న కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

