ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : కరీంనగర్ వేదికగా జరిగే ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను కార్మిక వర్గం భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ పిలుపునిచ్చారు. సోమవారం పాత కలెక్టరేట్ సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆటో స్టాండ్ వద్ద ఆటో కార్మికులతో కలిసి గోడపత్రికలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాసభల సందర్భంగా నిర్వహించే కార్మిక ప్రదర్శన, బహిరంగ సభకు కార్మికులు పెద్ద ఎత్తున హాజరుకావాలన్నారు. ప్రతినిధుల సభలో రాష్ట్రవ్యాప్తంగా 1,000 మంది పాల్గొంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, 12 గంటల పనిదినాల విధానాన్ని నిరసిస్తూ కార్మికులు పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నపాగ శ్రీనివాసులు, ఆటో డ్రైవర్లు ఎం.డి. రజాక్, భీమయ్య, బాలస్వామి, సర్దార్ తదితరులు పాల్గొన్నారు.

