Tuesday, August 25, 2026

Buy now

మీలాద్-ఉన్-నబీ పండుగను శాంతియుతంగా నిర్వహించాలి

* శాంతి, సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవంతో పండుగ జరుపుకోవాలి: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా

రామగుండం: మీలాద్-ఉన్-నబీ (ఈద్-ఎ-మిలాద్) పండుగను శాంతియుతంగా, సోదరభావంతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు. పండుగను పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ అధ్యక్షతన పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ముస్లిం మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, జూలూసులు, ర్యాలీల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై కమిటీ సభ్యులు, మత పెద్దలతో సీపీ చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

* అనుమతులు తీసుకుని ర్యాలీలు నిర్వహించాలి:
జూలూసులు, ర్యాలీలు నిర్వహించే ముందు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని, నిర్ణయించిన మార్గాల్లోనే కార్యక్రమాలు నిర్వహించాలని సీపీ సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు స్వచ్ఛంద సేవకులను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

అధిక శబ్దం కలిగించే సౌండ్ సిస్టమ్‌లు, డీజేలు, ఇతర పరికరాలను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించరాదని స్పష్టం చేశారు. చిన్నారులు, వృద్ధులు, విద్యార్థులు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.

* మతపరమైన మనోభావాలను గౌరవించాలి:
మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ప్రసంగాలు, పాటలు, నినాదాలకు దూరంగా ఉండాలని, ఇతర మతాలు, వర్గాల మనోభావాలను గౌరవించాలని సీపీ సూచించారు. యువత శాంతి, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ గొడవలు, వివాదాలకు దూరంగా ఉండాలని కోరారు.

పండుగ కార్యక్రమాల్లో మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ర్యాలీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు.

* సోషల్ మీడియా పుకార్లపై అప్రమత్తంగా ఉండాలి:
పండుగ సందర్భంగా కొంతమంది సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు, పుకార్లు సృష్టించే అవకాశం ఉందని సీపీ హెచ్చరించారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు చేసే అవకాశం ఉన్నందున ప్రజలు అటువంటి ప్రచారాలను నమ్మకుండా సంయమనం పాటించాలని కోరారు.

ఏదైనా సమాచారం నిజమా, కాదా అనే విషయాన్ని స్థానిక పోలీసులను సంప్రదించి నిర్ధారించుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ మత ఘర్షణలకు లేదా శాంతిభద్రతల సమస్యలకు కారణమయ్యే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

* పటిష్టమైన పోలీసు బందోబస్తు:
పండుగ సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో అవసరమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడతామని సీపీ తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని మతాలకు సంబంధించిన సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే డయల్ 112, కమిషనరేట్ కంట్రోల్ రూమ్ 8712656597 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సీపీ కోరారు.శాంతి, సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవంతో మీలాద్-ఉన్-నబీ పండుగను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, రామగుండం సీఐ కృష్ణ కుమార్, బెల్లంపల్లి వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ భీమేష్, ఆర్‌ఐ రమేష్, పెద్దపల్లి ఎస్‌ఐ నరేష్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ చంద్రశేఖర్, చెన్నూర్ టౌన్ ఎస్‌ఐ శ్యామ్ పటేల్, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular