పెద్దపల్లి: ఎన్నికల ముందు రైతులకు హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు రైతాంగాన్ని పూర్తిగా విస్మరించి కష్టాల కడలిలోకి నెట్టిందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రైతు భరోసా, రైతు బీమా, సన్న వడ్ల బోనస్, పంట కొనుగోళ్ల విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు.
శనివారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. రైతు భరోసా నిధులను నిలిపివేయడంతో పాటు రైతు బీమా ప్రీమియంను సకాలంలో చెల్లించక వేలాది రైతు కుటుంబాలను అన్యాయానికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సన్న వడ్లకు బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన కాంగ్రెస్, ఇప్పుడు 34 రకాల నుంచి కేవలం 7 రకాల వరికే పరిమితం చేస్తూ రైతుల ఆశలను అడియాశలు చేసిందన్నారు. దిగుబడి తక్కువ వచ్చే రకాలను మాత్రమే ప్రోత్సహిస్తూ రైతులను నష్టాల బాట పట్టిస్తోందని ఆరోపించారు.
కేంద్రం వరి కొనుగోలు చేయడం లేదనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పంట కొనుగోళ్ల నుంచి తప్పించుకోవాలని చూస్తోందని, అసలు ఉద్దేశం బోనస్ భారం తగ్గించుకోవడమేనని మండిపడ్డారు. ఎన్నికల ముందు పంట దిగుబడి మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతోందని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వం అండగా నిలిచిందని, రైతు బంధు, రైతు బీమా, ఎరువుల సరఫరా వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం యూరియా కొరత, పెరిగిన ఎరువుల ధరలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేల చొప్పున వెంటనే విడుదల చేయాలని, రైతు బీమా బకాయిలను చెల్లించాలని, ముందుగా ప్రకటించిన 34 రకాల సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలని, రైతులు పండించిన పంట మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రైతాంగంతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమాలకు శ్రీకారం చుడతామని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హెచ్చరించారు.
ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు నూనేటి సంపత్, స్రవంతి మోహన్ రావు, సందీప్ రావు, మార్కు లక్ష్మణ్, పారుపల్లి గుణపతి, కూకట్ల గోపి, వెన్నం రవీందర్, మోబిన్, పెంచల శ్రీధర్, పూదరి చంద్రశేఖర్, సలేంద్ర రాములు, ఫకీర్ యాదవ్, దీకొండ భూమేష్, అనుముల బాపూరావు, కాల్వల ఓదన్న, రేవల్లి తిరుపతి, మియాపూర్ శ్రీనివాస్, పోసాని శ్రీనివాస్, గందె మల్లికార్జున్, తిప్పారపు దయాకర్, ఆరెపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

