మెట్‌పల్లి: లోక్ అదాలత్‌ల ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని మెట్‌పల్లి జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి పేర్కొన్నారు. మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం మెట్‌పల్లి కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ, వివాదాల్లో ఉన్న కక్షిదారులు పరస్పర రాజీ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల న్యాయ ప్రక్రియలో అయ్యే సమయంతో పాటు ఖర్చులు కూడా గణనీయంగా ఆదా అవుతాయని తెలిపారు. లోక్ అదాలత్‌లలో రాజీ ద్వారా పరిష్కారమైన కేసులపై అప్పీల్‌కు అవకాశం ఉండదని, అందువల్ల ఇరు పక్షాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు.
అనంతరం నిర్వహించిన లోక్ అదాలత్‌లో మొత్తం 1,645 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో పరస్పర రాజీ ద్వారా 97 కేసులు, మీడియేషన్ ద్వారా 16 కేసులు, అడ్మిషన్స్ ద్వారా 58 కేసులు, పీఎల్‌సీ ద్వారా 25 కేసులు, ఎస్టీసీ కేసులు 1,449 పరిష్కారమయ్యాయి.
ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దయ్యా రాజారాం, ఏపీపీ జి. ప్రణయ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలేటి రామ్ రెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు వడ్డేపల్లి శ్రీనివాసన్, జేడి సుధాకర్, మీడియేషన్ సభ్యులు ఒజ్జెల శ్రీనివాస్, బక్కూరి రమేష్, తునికి వేణుగోపాల్, పసునూరి శ్రీనివాస్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

