పెద్దపల్లి :ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపుతో పాటు విద్యా ప్రమాణాల మెరుగుదలకు లక్ష్యబద్ధంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారుల తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన ఉపాధ్యాయులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గత విద్యా సంవత్సరంలో పనిచేసిన విద్యా వాలంటీర్ల సేవలను ఈ విద్యా సంవత్సరంలోనూ కొనసాగిస్తామని తెలిపారు. అవసరమైతే స్థానికంగా విద్యా వాలంటీర్లను నియమించేందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఏ పాఠశాలలోనూ ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.
ఉపాధ్యాయులందరూ ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా 100 శాతం హాజరు నమోదు చేయాలని, ప్రతి రోజు హాజరు వివరాలను పర్యవేక్షిస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల సెలవుల మంజూరు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని సూచించారు.బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను 10 శాతం పెంచాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 3 వేల మంది కొత్త విద్యార్థులను చేర్పించాలని, ప్రతి మండలానికి 300 మంది విద్యార్థుల చేర్పు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కొత్తగా చేరిన విద్యార్థుల వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో 15 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న 120 పాఠశాలలు, సున్నా నమోదు ఉన్న 35 పాఠశాలలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. అలాగే మోడల్ స్కూళ్లలో కూడా విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
తక్కువ నమోదు ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించే విధంగా పనిచేయాలని ఆదేశించారు.ప్రతి విద్యార్థికి అభార్ నంబర్ జనరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, యూడైస్ వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. విద్యార్థుల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీట్లను పూర్తిగా భర్తీ చేయాలని, అర్హులైన ఏ విద్యార్థి ప్రవేశాన్ని తిరస్కరించవద్దని ఆదేశించారు. కేజీబీవీల్లో వాచ్‌మెన్, ఉపాధ్యాయులు, వంట మనుషుల ఖాళీలు ఉన్నట్లయితే వెంటనే నియామకాల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.
ఉన్నత తరగతుల విద్యార్థులకు నాణ్యమైన విద్యా, పోటీ పరీక్షల శిక్షణ అందించేందుకు వారానికి ఒకసారి అన్‌అకాడమీ, ఫిజిక్స్‌వాలా వంటి డిజిటల్ విద్యా వేదికల ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన కంప్యూటర్ వ్యవస్థలు, ఇంటర్నెట్ సౌకర్యాలు, ఇతర వనరులను వచ్చే పది రోజుల్లో సిద్ధం చేయాలని, కార్యక్రమాల షెడ్యూల్‌ను క్రమబద్ధీకరించాలని సూచించారు.
ప్రాథమిక పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కాంప్లెక్స్ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి పెట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులే నివేదికల్లో ప్రతిబింబించాలని, తప్పుడు గణాంకాలకు తావు ఇవ్వొద్దని సూచించారు. తక్కువ ఫలితాలు సాధిస్తున్న పాఠశాలలపై ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు.
ఏఎక్స్‌ఎల్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి శనివారం కాంప్లెక్స్ హెచ్‌ఎంలు సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి సమీక్షల ద్వారా విద్యా ప్రమాణాల్లో గణనీయమైన మార్పు సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో పకడ్బందీగా టైమ్‌టేబుల్ రూపొందించి అమలు చేయాలని సూచించారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల సమస్యలను అధికశాతం పరిష్కరించినందున వచ్చే 45 రోజులు ప్రాథమిక విద్యార్థుల అభ్యాస నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జూలై నెల నుంచి అన్ని పాఠశాలలు పూర్తి స్థాయిలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జిల్లాలోని 48 ప్రీ-ప్రైమరీ పాఠశాలలకు అవసరమైన నియామక ప్రక్రియ పూర్తయిందని, వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. చిన్నారులకు విద్య ఆనందదాయకంగా ఉండేలా బొమ్మలు, విద్యా సామగ్రి అందుబాటులో ఉంచాలని తెలిపారు.
నాబార్డ్ నిధులతో చేపడుతున్న విద్యా మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు సేవలందిస్తున్న భవిత కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని, ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసిన ఈ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు.ప్రత్యేక అవసరాలు ఉన్న ప్రతి చిన్నారిని గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించేందుకు కృషి చేయాలని, బడిబాట కార్యక్రమంలో కూడా ఈ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ప్రతి నెల విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని, ఉన్నత పాఠశాలల్లో సిలబస్ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. విధులు సక్రమంగా నిర్వహించని ఉపాధ్యాయులపై, ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు ఫోరమ్‌లను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో , అకడమిక్ మానిటరింగ్ అధికారి పి.ఎం. షేక్, మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

