Wednesday, June 24, 2026

Buy now

26మంది ఈవోలకు పదోన్నతులు

దేవాదాయ శాఖలో ఉద్యోగులు, అర్చకులు, ఇతర సిబ్బందికి నిబంధనల ప్రకారం అందాల్సిన హక్కులు, సంక్షేమ ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 కార్యనిర్వహణ అధికారులుగా పదోన్నతి పొందిన 26 మంది ఈవోలకు ఆమె ప్రమోషన్ ఉత్తర్వులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేవాదాయ శాఖలో పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని తెలిపారు. ఏడు జోన్ల పరిధిలో అర్హత సాధించిన 26 మంది ఈవోలకు నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించినట్లు వెల్లడించారు. త్వరలో అసిస్టెంట్ కమిషనర్‌ల నుంచి డిప్యూటీ కమిషనర్‌లకు, అలాగే మరిన్ని ఈవోలకు పదోన్నతులు కల్పించనున్నట్లు చెప్పారు.

ఉద్యోగులు, అర్చకులు సంతృప్తిగా ఉంటేనే వారు మరింత నిబద్ధతతో పనిచేసి భక్తులకు మెరుగైన సేవలు అందించగలరని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆలయాల నిర్వహణను మరింత బలోపేతం చేయడానికి ఈవోల అభ్యర్థన మేరకు అదనపు సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ కమిషనర్ వి. హన్మంతరావును ఆదేశించారు.
అర్చకులు, ఇతర ఉద్యోగుల కోసం అమలు చేస్తున్న ‘అర్చక, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు’ పరిధిలోని పలు పథకాల ప్రయోజనాలను ప్రభుత్వం మరోసారి పెంచినట్లు మంత్రి ప్రకటించారు. రిటైర్మెంట్ గ్రాట్యుటీ, ఉపనయనం గ్రాంట్, ఇంటి నిర్మాణ పథకం, విద్యా సహాయం తదితర పథకాల కింద పెంచిన ఆర్థిక ప్రయోజనాలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు.

సంక్షేమ పథకాల అమలు మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రీన్‌ ఛానల్‌ విధానం ద్వారా ఆర్థిక సహాయాన్ని నేరుగా అర్చకుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని దేవాలయాల్లో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని, ఆలయాలను పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈవోల ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ వి. హన్మంతరావు, తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డీవీఆర్ శర్మ, వివిధ అర్చక సంఘాల ప్రతినిధులు, ఈవోలు, ఉద్యోగులు, అర్చకులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular