Wednesday, June 24, 2026

Buy now

త్వరలోనే సింగరేణి మెడికల్ బోర్డు పునరుద్ధరణ

సింగరేణిలో కొంతకాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డు ప్రక్రియను యథావిధిగా త్వరలోనే ప్రారంభించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెడికల్ బోర్డు ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని సూచించారు.

ఇటీవల కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో మెడికల్ బోర్డు అంశాన్ని వారు తన దృష్టికి తీసుకువచ్చారని భట్టి విక్రమార్క తెలిపారు. కార్మికుల్లో నెలకొన్న ఆందోళనలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి, వారి ప్రయోజనాలను కాపాడే దిశగా చర్యలు చేపడుతోందన్నారు.

మెడికల్ బోర్డు ద్వారా నిజంగా అర్హులైన ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం కల్పించి, వారి వారసులకు కారుణ్య నియామకాల రూపంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు, మధ్యవర్తిత్వం లేదా మోసాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను అమలు చేయాలని స్పష్టం చేశారు.

మెడికల్ బోర్డు ప్రక్రియపై విశ్వాసం ఉంచి యాజమాన్యానికి సహకరించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు ఈ నెల 13న మంచిర్యాలలో నిర్వహించే కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు.

సింగరేణిలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మారుపేర్ల సమస్య కూడా ప్రభుత్వ దృష్టిలో ఉందని ఆయన పేర్కొన్నారు. దీనికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నామని, న్యాయ సలహా తీసుకుంటున్నామని తెలిపారు. నిబంధనల మేరకు సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

ప్రజా ప్రభుత్వం వచ్చాక 2,657 ఉద్యోగాల భర్తీ
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణిలో 2,657 పోస్టులను భర్తీ చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. వీటిలో 555 ప్రత్యక్ష నియామకాలు, 2,102 కారుణ్య నియామకాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రత్యక్ష నియామకాలను ఆన్‌లైన్ విధానంలో చేపట్టి వివాదాలకు తావులేకుండా అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. కారుణ్య నియామకాల గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచడం ద్వారా మరింత మందికి అవకాశం కల్పించామని, ఇప్పటికే 200 మంది లబ్ధి పొందినట్లు వెల్లడించారు.

ఉద్యోగులకు బీమా, వైద్య సదుపాయాల విస్తరణ
దేశంలోనే తొలిసారిగా సింగరేణిలో పనిచేస్తున్న 40 వేల మంది ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ప్రమాద బీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు. అలాగే బ్యాంకులతో సంప్రదింపులు జరిపి ఉద్యోగుల కోసం రూ.10 లక్షల ఉచిత సహజ మరణ బీమా సదుపాయాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.40 లక్షల ప్రమాద బీమా కల్పించినట్లు వెల్లడించారు.

ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు, ఆధారిత పిల్లలకు వైద్య సేవల కోసం ఏటా రూ.300 కోట్లకు పైగా వెచ్చిస్తున్నామని తెలిపారు. అన్ని ఏరియా ఆసుపత్రుల ఆధునికీకరణతో పాటు గోదావరిఖనిలో క్యాథ్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

లాభాల వాటా పంపిణీలో రికార్డు
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా కార్మికులకు లాభాల వాటా చెల్లించినట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత రెండేళ్లలో రూ.1,500 కోట్లను లాభాల వాటాగా పంపిణీ చేసినట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ అందిస్తున్నామని చెప్పారు. 2023-24లో ఒక్కొక్కరికి రూ.5,000, 2024-25లో రూ.5,500 చొప్పున లాభాల బోనస్ పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

కొత్త బొగ్గు బ్లాకులతో ఉపాధి అవకాశాలు
సింగరేణిని మరింత విస్తరించి ఉద్యోగుల వారసులకు ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. ఒడిశాలోని నైనీ బ్లాక్‌కు అనుమతులు సాధించడంతో పాటు బొగ్గు ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు కూడా సింగరేణి కార్యకలాపాలను విస్తరించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పోటీ మార్కెట్‌లో సింగరేణి మరింత బలోపేతం కావాలంటే ఉత్పత్తి, ఉత్పాదకత పెరగాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Related Articles

spot_img

Most Popular