లోక్ అదాలత్ ద్వారా సామరస్యపూర్వకంగా సమస్యలకు ముగింపు.
ఈ నెల 20న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.
ఈ నెల 20వ తేదీన, శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా వివాదాలు శాంతియుతంగా, రాజీ మార్గంలో పరిష్కారమవుతాయని తెలిపారు.
రాజీకి అనువైన క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన,కుటుంబ మరియు వైవాహిక కేసులు, బ్యాంకు బకాయిల వసూళ్లు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు వంటి అంశాల్లో ఇరుపక్షాలు పరస్పరం చర్చించుకొని లోక్ అదాలత్ ద్వారా రాజీకి రావచ్చని పేర్కొన్నారు.
చిన్నచిన్న వివాదాల కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, ధనం వృథా చేసుకోకుండా, న్యాయశాఖ కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని శాంతియుత పరిష్కారం పొందాలని సూచించారు.
పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలోని పోలీసు అధికారులు,కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు మరియు ఇతర పోలీసు సిబ్బందికి తగిన మార్గదర్శకాలు అందించి, రాజీకి అనువైన కేసులను గుర్తించాలని కమిషనర్ ఆదేశించారు. ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి,రాజీ కుదిరేలా కృషి చేయాలని సూచించారు.
తమ కేసుల్లో రాజీ కావాలని కోరుకునే వ్యక్తులు సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు. లోక్ అదాలత్ ద్వారా వివాదాలు త్వరితగతిన పరిష్కారమై బాధితులకు సత్వర న్యాయం అందుతుందని పేర్కొన్నారు.
లోక్ అదాలత్‌పై ప్రజలకు సూచనలు:
* ఇరుపక్షాల సమ్మతితోనే రాజీ సాధ్యమవుతుంది.
* లోక్ అదాలత్‌లో కుదిరిన రాజీ చట్టపరంగా తుది తీర్పుగా పరిగణించబడుతుంది
* ప్రతి కేసులో న్యాయమూర్తులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తల సమన్వయంతో పరిష్కార ప్రక్రియ కొనసాగుతుంది.
ప్రజలు,పోలీసు శాఖ, న్యాయస్థానాలు సమన్వయంతో పనిచేస్తే చిన్న వివాదాలు పెద్ద సమస్యలుగా మారకముందే పరిష్కరించవచ్చని పోలీస్ కమిషనర్ అన్నారు

