Tuesday, June 23, 2026

Buy now

తెలంగాణ రాష్ట్ర వన సంరక్షణ ప్రతిభా పురస్కారాలు!

అటవీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక వన సంరక్ష పురస్కారాలు,అటవీ సంపద సంరక్షణ, విధుల నిర్వహణలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న అటవీశాఖ సిబ్బందికి పతకాలు ఇవ్వాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి కి విన్నవించిన మంత్రి కొండా సురేఖ,వన మహోత్సవం – 2026 ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ తెలంగాణ రాష్ట్ర వన సంరక్షణ ప్రతిభా పురస్కార పతక నియమావళి అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం,అటవీ సంరక్షణలో విశిష్ట సేవలకు నగదు ప్రోత్సాహకాలతో అవార్డులు,అటవీ శాఖలో సేవాస్ఫూర్తి పెంపునకు కొత్త పురస్కారాల విధానం,హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన అటవీశాఖ సిబ్బంది,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కొండా సురేఖ

తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ సిబ్బంది అటవీ సంపద పరిరక్షణ, అటవీ భూముల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, అక్రమ కలప, వన్యప్రాణుల ఉత్పత్తుల రవాణా నియంత్రణ, అటవీ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో తమ ప్రాణాలకు తెగించి విశిష్ట సేవలు అందిస్తున్న అటవీ శాఖ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ రోజు వన మహోత్సవం – 2026 ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ సంపద సంరక్షణలో ప్రాణాలకు తెగించి పోట్లాడుతున్న అటవీ శాఖ సిబ్బందిని ప్రోత్సహిస్తూ ” తెలంగాణ స్టేట్ వన సంరక్ష మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ రూల్స్–2026 (తెలంగాణ రాష్ట్ర వన సంరక్షణ ప్రతిభా పురస్కార పతక నియమావళి )” ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

ఈ నూతన విధానం ద్వారా అటవీ శాఖ సిబ్బంది సేవలను అధికారికంగా గుర్తించి, వారి కృషికి తగిన గౌరవం కల్పించేందుకు నాలుగు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అమల్లోకి తెచ్చింది. తెలంగాణ వన సంరక్ష పతకము (రజత పతకం), తెలంగాణ ఉత్తమ వన సంరక్ష పతకం (వెండి పతకం), తెలంగాణ విశిష్ట వన సంరక్ష పతకం (బంగారు పతకం) తెలంగాణ ముఖ్యమంత్రి వన శౌర్య పతకం (ప్రత్యేక బంగారు పతకం) పేర్లతో నాలుగు పురస్కారాలను ప్రవేశపెట్టింది.

ఈ పురస్కారాల కింద పతకంతో పాటు నగదు బహుమతి, నెలవారీ ప్రోత్సాహక నగదు కూడా అందజేయనున్నారు. తెలంగాణ వన సంరక్ష పథకానికి రూ.10,000, ఉత్తమ వన సంరక్ష పథకానికి రూ.15,000, విశిష్ట వన సంరక్ష పథకానికి రూ.20,000, ముఖ్యమంత్రి వన శౌర్య పథకానికి రూ.25,000 నగదు బహుమతిని అవార్డు గ్రహీతలకు అందజేయనున్నారు. అదనంగా నెలవారీ నగదు ప్రోత్సాహకం కూడా ఇస్తారు.

అటవీ భూములను ఆక్రమణల నుంచి కాపాడడం, అటవీ నేరాల నియంత్రణ, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ అభివృద్ధి కార్యక్రమాల అమలు, నర్సరీల నిర్వహణ, అటవీ అగ్నిప్రమాదాల నివారణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(GIS), మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (MIS), పరిశోధన తదితర రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఈ అవార్డులకు ఎంపిక చేయనున్నారు.

అటవీ శాఖలో సేవాస్ఫూర్తి, అంకితభావం, విధి పట్ల నిబద్ధతను మరింత పెంపొందించడంతో పాటు అటవీ సంపద రక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచే సిబ్బందిని ప్రోత్సహించడమే ఈ పురస్కారాల ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి సురేఖ పేర్కొన్నారు. ఈ పురస్కారాలు అటవీ సంపద పరిరక్షణలో ఉద్యోగులు, సిబ్బంది ఉత్తమ సేవలు అందించేందుకు ప్రేరణనందిస్తాయని తెలిపారు.

అటవీ సంపద పరిరక్షణలో తమ ప్రాణాలొడ్డి శ్రమిస్తున్న సిబ్బందిని ప్రోత్సహించే విధంగా వారికి అవార్డులు ప్రకటించాలన్న తన అభ్యర్థనకు త్వరలోనే కార్యరూపాన్నిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు, ఉద్యోగుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సురేఖ అన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 న లేదా ప్రభుత్వం నిర్ణయించిన ఇతర ప్రత్యేక రోజుల్లో ఈ అవార్డుల కార్యక్రమం వుంటుందని మంత్రి సూత్రప్రాయంగా తెలిపారు.

Related Articles

spot_img

Most Popular