ఖమ్మంలో లైంగిక దాడికి గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలికకు శస్త్రచికిత్స
నిమ్స్‌లో బాలిక తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి సీతక్క, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ జస్టిస్ పంచాక్షరి బాలికకు అందుతున్న వైద్య చికిత్సపై వివరాలు తెలిపిన వైద్యులు,ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయ చెక్కును అందజేసిన మంత్రి సీతక్క, జస్టిస్ పంచాక్షరి,ఖమ్మం జిల్లాలో లైంగిక దాడికి గురై ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు.
బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు మంత్రి సీతక్క, తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ జస్టిస్ పంచాక్షరి నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు.ఈ సందర్భంగా బాలికకు అందుతున్న వైద్య చికిత్స, శస్త్రచికిత్స అనంతర పరిస్థితిపై వైద్యులు వారికి వివరించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తున్నట్లు వైద్య బృందం తెలిపింది.
అనంతరం బాలిక తల్లిదండ్రులను కలిసిన మంత్రి వారికి ధైర్యం చెప్పారు. అధైర్యపడవద్దని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కుటుంబానికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. బాలిక పూర్తిగా కోలుకునే వరకు అవసరమైన వైద్యం అందించడంతో పాటు అన్ని విధాలుగా సహాయం చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున బాధిత బాలిక కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయ చెక్కును మంత్రి సీతక్క, జస్టిస్ పంచాక్షరి కలిసి అందజేశారు. బాలిక చికిత్స, పునరావాసం, కుటుంబ అవసరాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని పేర్కొన్నారు.
బాలిక ఆరోగ్యం మెరుగుపడి సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కుటుంబానికి అవసరమైన ఆర్థిక, న్యాయపరమైన సహాయాన్ని కూడా అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

