విద్యుత్ రంగం బలోపేతానికి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం,రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే కాలంలో విద్యుత్ అవసరాలు గణనీయంగా పెరిగే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2035 నాటికి రాష్ట్ర విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం ఉన్న స్థాయి కంటే రెట్టింపు అయ్యే అవకాశం ఉందని, పీక్ డిమాండ్ 34 వేల మెగావాట్లకు పైగా చేరుకునే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ రంగాల్లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఆధునిక సాంకేతికతను వినియోగించాలని పేర్కొన్నారు.
ఇటీవల తీవ్ర వేసవి పరిస్థితుల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైనప్పటికీ, ఎలాంటి అంతరాయం లేకుండా ప్రజలకు, రైతులకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడంపై డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ అధికారులను అభినందించారు. విద్యుత్ రంగంలో సమర్థవంతమైన ప్రణాళిక, ఉద్యోగుల కృషి కారణంగానే ఈ విజయాన్ని సాధించగలిగామని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడులు, సంస్కరణలు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

