Wednesday, June 24, 2026

Buy now

వనజ మృతి ఘటనపై ప్రభుత్వం సీరియస్

*ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలతో తక్షణ విచారణ
*విధులకు గైర్హాజరైన మెడికల్ ఆఫీసర్ సస్పెండ్
*వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేసిన మరో ముగ్గురిపై చర్యలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని శంభునిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి శ్రీమతి కుంజా వనజ మృతి ఘటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు ఘటనపై వెంటనే సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు, బాధ్యులపై కఠిన చర్యలు ప్రారంభించింది.

కుంజా వనజ గుండాల పీహెచ్‌సీలో గర్భిణిగా నమోదు చేసుకుని మాతా-శిశు ఆరోగ్య మార్గదర్శకాల ప్రకారం క్రమం తప్పకుండా గర్భధారణ పరీక్షలు చేయించుకున్నారు. జూన్ 13న పురిటి నొప్పులతో, అత్యంత క్లిష్ట పరిస్థితిలో పీహెచ్‌సీకి చేరుకున్న ఆమె మృత శిశువుకు జన్మనిచ్చారు. అనంతరం తీవ్రమైన రక్తస్రావం జరగడంతో వెంటనే ప్రాథమిక చికిత్స అందించి ఎల్లందు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అన్ని విధాలుగా చికిత్స అందించినప్పటికీ, తీవ్రమైన రక్తస్రావం కారణంగా హీమరేజిక్ షాక్, అనంతరం కార్డియాక్ అరెస్ట్ తో ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

బాధ్యులపై కఠిన చర్యలు
ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాల మేరకు జూన్ 17న భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారితో ప్రాథమిక విచారణ నిర్వహించగా, సమాచార వ్యవస్థ, కేసు నిర్వహణ, రిఫరల్ ప్రక్రియలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. తీవ్రమైన రక్తహీనత (హిమోగ్లోబిన్ సుమారు 3 గ్రాములు) ఉన్న గర్భిణిని ముందుగానే గుర్తించి వైద్యాధికారికి సమాచారం అందించడంలో, సకాలంలో రిఫర్ చేయడంలో విఫలమైన ఆశా కార్యకర్త మొకల్ల లక్ష్మి, ఎ ఎన్ ఎం పి. ధనమ్మపై శాఖాపరమైన చర్యలు ప్రారంభించారు.

ఘటన జరిగిన సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల్లో ఉన్న ఏఎన్ ఎం ఈ. జ్ఞానేశ్వరి వైద్యాధికారిని సంప్రదించకుండా ప్రసవం నిర్వహించడం, తీవ్ర రక్తస్రావం ఉన్నప్పటికీ రోగితో పాటు ఆరోగ్య సిబ్బందిని పంపించకపోవడం వంటి అంశాలను కూడా తీవ్రంగా పరిగణిస్తూ ఆమెపై శాఖాపరమైన చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన కీలక సమయంలో విధులకు గైర్హాజరైన గుండాల పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చి. సుదీప్ ను పూర్తి స్థాయి విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నిజానిజాలు వెలికితీసేందుకు ఉన్నతస్థాయి కమిటీతో సమగ్ర విచారణ కొనసాగుతోంది
ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు సూచించేందుకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్, జాయింట్ డైరెక్టర్ (మాతా-శిశు ఆరోగ్యం) డాక్టర్ సుధీర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ రాథోడ్ తుకారామ్ , DCHS డాక్టర్ జి. రవిబాబు సభ్యులుగా ఉన్న ఉన్నతస్థాయి బృందాన్ని ప్రభుత్వం నియమించింది. ఈ బృందం పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన మాతా శిశు ఆరోగ్య సేవలు అందించడం రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో పూర్తి విచారణ నివేదిక వెలువడకముందే వాస్తవాలను వక్రీకరించి ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా ప్రచారం చేయడం సమంజసం కాదని ఆరోగ్య శాఖ పేర్కొంది.

Related Articles

spot_img

Most Popular