Wednesday, June 24, 2026

Buy now

సింగరేణి ప్రాంతాన్ని కాంగ్రెస్ నేతలు దోచుకుంటున్నారు: కల్వకుంట్ల కవిత

పెద్దపల్లి:సింగరేణి ప్రాంత వనరులు, ప్రజల సంపదను అధికార కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్దపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం మాత్రం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు.

గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న “బాయిబాట” కార్యక్రమంలో భాగంగా చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, రామగుండం, మంథని ప్రాంతాల్లోని బొగ్గుగనులను సందర్శించి కార్మికులు, రైతుల సమస్యలను తెలుసుకున్నామని తెలిపారు. రేపు భూపాలపల్లి ప్రాంతంలోని బొగ్గుగనులను సందర్శించనున్నట్లు వెల్లడించారు.

భట్టి-శ్రీధర్ బాబు-ప్రేమ్ సాగర్ రావుపై తీవ్ర విమర్శలు
మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దోపిడీ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర స్థాయిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా వారికి అండగా నిలుస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను పక్కనబెట్టి ఇసుక, మట్టి, బూడిద దందాల్లో నిమగ్నమయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కల్లాల్లోనే రైతుల ప్రాణాలు పోతున్నాయి
ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని కవిత అన్నారు. మిల్లర్లు వడ్లు కొనకపోవడంతో యువ రైతులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కల్లాల వద్దనే రైతులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం కొన్ని రకాల వడ్లకే పరిమితం కావడం రైతులను మోసం చేయడమేనని ఆరోపించారు. రైతు భరోసా పంపిణీలోనూ స్పష్టత లేదని, రెండు ఎకరాలకే పరిమితం చేస్తున్నారా అనే సందేహాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

యూరియా కోసం రైతుల అవస్థలు
యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. యూరియా యాప్ పేరుతో రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే యూరియా యాప్‌ను రద్దు చేసి రైతులకు సులభంగా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

డిపెండెంట్ ఉద్యోగాల్లో రాజకీయాలు
సింగరేణిలో వేలాది డిపెండెంట్ ఉద్యోగాలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వం రాజకీయ ప్రదర్శనలకే పరిమితమైందని ఆరోపించారు. రెండు వేల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా వందల సంఖ్యలో మాత్రమే భర్తీ చేస్తున్నారని విమర్శించారు. రైతు భరోసా, ఉద్యోగాలను కూడా రాజకీయ సభల ప్రచారానికి ఉపయోగిస్తున్నారని అన్నారు.

పత్తిపాక రిజర్వాయర్, ఎస్సారెస్పీ కాలువపై ఆగ్రహం
పెద్దపల్లి జిల్లాలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణంపై ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని కవిత విమర్శించారు. ఓపెన్‌కాస్ట్ గనుల ప్రభావంతో దెబ్బతిన్న ఎస్సారెస్పీ కాలువ మరమ్మతులు 30 నెలలుగా పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. మంథని-ముత్తారం లింకేజీ పనులను వేగవంతం చేయాలని, భూపాలపల్లి బ్యాక్‌వాటర్ ప్రభావిత రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

రామగుండంలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి
రామగుండం ప్రాంతంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుందని, ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని కోరారు. కార్మికుల సంక్షేమం కోసం ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు దిశగా స్థానిక ఎంపీ కృషి చేయాలని సూచించారు.

ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ వైఫల్యం
ఎన్నికల సమయంలో లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పరిమిత సంఖ్యలో మాత్రమే నోటిఫికేషన్లు విడుదల చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండగా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో అవకాశాలు కల్పించడం లేదన్నారు.

ప్రత్యామ్నాయం కోసం ప్రజల ఎదురు చూపులు
ప్రస్తుత ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్య పాలనతో ప్రజలు విసిగిపోయారని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురుచూస్తున్నారని కవిత పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన ప్రజల ఆశయాలకు ప్రతినిధిగా ఎదుగుతుందని, రైతులు, కార్మికులు, యువత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

Related Articles

spot_img

Most Popular