Tuesday, June 23, 2026

Buy now

పటాన్‌చెరులో మంత్రి వివేక్ వెంకటస్వామి ఈఎస్ఐ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

పటాన్ చెరు: తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాస్త్ర శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పటాన్‌చెరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఒకవైపు ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలిస్తూ, మరోవైపు లోకకల్యాణం కోసం దేవాలయాలను సందర్శిస్తూ బీరంగూడ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఆయన పర్యటన సాగింది.

ఈ పర్యటనలో భాగంగా మంత్రి వివేక్ వెంకటస్వామి రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ఆయన ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించారు.

అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలు, చికిత్సా విధానం, మౌలిక వసతులు, పారిశుద్ధ్య పరిస్థితులు మరియు సిబ్బంది పనితీరును వారు నిశితంగా పరిశీలించారు. బెడ్ల వద్దకు వెళ్లి పేషంట్లతో స్వయంగా మాట్లాడి, వారికి అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఆసుపత్రి తనిఖీ అనంతరం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా బీరంగూడ డివిజన్ పరిధిలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆయన సతీమణి తో పాటు కుమారుడు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

అనంతరం అక్కడే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య మంత్రి కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందజేసి, తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్, అమీన్ పూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి తో మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular