2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే తెలంగాణ లక్ష్యం,
హైదరాబాద్ సేవారంగానికే కాదు.. తయారీ రంగానికీ కేంద్రంగా ఎదగాలి,
పారిశ్రామికాభివృద్ధి అంటే పెట్టుబడులే కాదు.. ఉపాధి, గౌరవం, సమగ్ర వికాసం,
ఎంఎస్ఎంఈలకు అండగా ప్రభుత్వం.. ప్రతి శుక్రవారం భేటీ:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్ : మాదాపూర్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న Industrial Innovation & Technology Expo (IITX–2026) ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు.
ఎఫ్‌టీసీసీఐ వరుసగా మూడో ఏడాది ఈ ఎక్స్పోను నిర్వహించడం అభినందనీయం, ప్రభుత్వం–పరిశ్రమల మధ్య వారధిగా ఎఫ్‌టీసీసీఐ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తయారీ రంగ సంస్థలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు, విద్యాసంస్థలు, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఇలాంటి ఎక్స్‌పోలు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఎంతో ఉపయోగకరం.
ఇండస్ట్రియల్ ఎక్స్ పోలు కేవలం యంత్రాలు, ఉత్పత్తుల ప్రదర్శనలకే పరిమితం కావని, అవి కొత్త ఆలోచనలకు, భాగస్వామ్యాలకు, వ్యాపార అవకాశాలకు కేంద్రబిందువులన్నారు. ఒక చిన్న పారిశ్రామికవేత్తకు కొత్త వినియోగదారుడు, ఒక స్టార్టప్‌కు తొలి కొనుగోలుదారుడు, ఒక విద్యార్థికి భవిష్యత్ ఉపాధి దిశను చూపించగల సామర్థ్యం ఇలాంటి వేదికలకు ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 12 ఏళ్లలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సంపాదించుకుని దేశంలో అత్యంత చురుకైన రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణ ఎదిగిందన్నారు. హైదరాబాద్ ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, స్టార్టప్‌లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినా, తెలంగాణ తదుపరి అభివృద్ధి దశ బలమైన పారిశ్రామిక పునాదులపైనే ఆధారపడాల్సి ఉందని స్పష్టం చేశారు.
తయారీ రంగం ఉద్యోగాల సృష్టికి, ఎంఎస్ఎంఈల బలోపేతానికి, జిల్లాలు–పట్టణాలకు అభివృద్ధిని విస్తరించేందుకు అత్యంత కీలకమన్నారు. పారిశ్రామికాభివృద్ధి అంటే కేవలం పెట్టుబడులే కాదు, అది జీవనోపాధి, గౌరవప్రదమైన ఉపాధి, సమగ్ర అభివృద్ధికి ప్రతీక గా ఉందన్నారు.
పారదర్శక పాలన, వేగవంతమైన అనుమతులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత స్వీకరణ, ఆర్థిక వనరుల అందుబాటు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఎంఎస్ఎంఈలు, పారిశ్రామిక సంఘాలతో నిరంతర సంభాషణ కొనసాగించేందుకు ప్రతి శుక్రవారం సమయం కేటాయిస్తామన్నారు.
వ్యాపార నిర్వహణ సౌలభ్యం పెద్ద కంపెనీలకే కాకుండా ఎంఎస్ఎంఈలు, యువ పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తలు, గ్రామీణ ఆవిష్కర్తలకు కూడా అందుబాటులో ఉండాలన్నారు. మంచి ఆలోచనలకు సమాన అవకాశాలు లభించే వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఎలక్ట్రిక్ మొబిలిటీ, పునరుత్పాదక ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, ఆటోమేషన్, రోబోటిక్స్, ఏఐ, డిజిటల్ ట్విన్స్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలు భవిష్యత్ పారిశ్రామిక విప్లవానికి కేంద్రబిందువులన్నారు. తెలంగాణ ఇప్పటికే అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులపై వందశాతం మినహాయింపు కల్పించిందన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 5 గిగావాట్లకు పైగా సౌర విద్యుత్ సామర్థ్యం ఉంది, 2035 నాటికి దానిని దాదాపు 34 గిగావాట్లకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని వెల్లడించారు. పరిశ్రమలకు నాణ్యమైన, చవకైన, హరిత విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
తెలంగాణ పారిశ్రామికాభివృద్దిలో ఎంఎస్ఎంఈ లది కీలక పాత్ర , ఆర్థిక సహాయం, నాణ్యత ధృవీకరణ, డిజైన్, సాంకేతికత, మార్కెట్ అవకాశాలు, నైపుణ్య శిక్షణ వంటి అన్ని రంగాల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందుకు ప్రభుత్వ పెట్టుబడులతో పాటు ప్రజా–ప్రైవేటు(PPP)భాగస్వామ్యాలు కీలకమన్నారు. రాష్ట్రంలోని సహజ వనరులు, అవకాశాలను వినియోగించుకునేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో సమృద్ధిగా నీరు, నిరంతర విద్యుత్ సరఫరా, అత్యుత్తమ మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన యువత, భౌగోళిక అనుకూలత, భాషాపరమైన అవరోధాలు లేకపోవడం వంటి ప్రత్యేకతలు పెట్టుబడిదారులకు అపూర్వ అవకాశాలన్నారు. పెట్టుబడిదారులను సంపద సృష్టికర్తలుగా చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
ఎఫ్‌టీసీసీఐ ప్రభుత్వం–పరిశ్రమల మధ్య వారధిగా కొనసాగాలని, రంగాల వారీగా సూచనలు, ప్రతిపాదనలు, నిర్మాణాత్మక అభిప్రాయాలు అందించాలని కోరారు. తెలంగాణను మరింత బలమైన, హరిత, స్మార్ట్, ప్రపంచస్థాయి పోటీ సామర్థ్యం కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఎగ్జిబిటర్లు, ఎంటర్ప్రెన్యూర్లు, స్టార్టప్‌లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎక్స్పోను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

