Monday, September 21, 2026

Buy now

కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధనకై సెప్టెంబర్ 10న దీక్ష

* ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఎదుట నిరసన శిబిరం
* తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్ పిలుపు

రామగుండం: కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 10న ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఎదుట చేపట్టనున్న దీక్షను విజయవంతం చేయాలని తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

వివిధ డిపార్ట్‌మెంట్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు బుధవారం కరపత్రాలు అందజేసిన ఆయన.. సెప్టెంబర్ 10న నిర్వహించనున్న దీక్ష శిబిరానికి ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సిన హై పవర్ కమిటీ వేతనాలు, ఉద్యోగ భద్రతతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు.

2013 అగ్రిమెంట్ అమలు చేయాలి:
2013లో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ వేతనాలు అమలవుతున్నాయని, సింగరేణిలో మాత్రం సంబంధిత ఒప్పందం అమలుకు నోచుకోకపోవడం బాధాకరమని మద్దెల శ్రీనివాస్ అన్నారు.

కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో పాటు, సరైన వేతనాలు అందకపోవడం వల్ల కుటుంబ పోషణ భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు, కుటుంబ అవసరాలను తీర్చుకోవడంలో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

సెలవులు, పండుగలకు కూడా విధులు:
పండుగలు, సెలవులు అనే తేడా లేకుండా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన కోసం నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు.

పార్టీలకతీతంగా తరలిరావాలి:
తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న దీక్షకు పార్టీలకు అతీతంగా ప్రతి యూనియన్ నాయకుడు, కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరై కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని మద్దెల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల కోసం చేపడుతున్న ఈ పోరాటానికి ప్రతి ఒక్కరూ అండగా నిలిచి, సెప్టెంబర్ 10న జరిగే దీక్షను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Related Articles

spot_img

Most Popular