Monday, September 21, 2026

Buy now

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ – INTUC ప్రతినిధి బృందంతో భేటీ

హైదరాబాద్: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, పెండింగ్‌లో ఉన్న హామీల అమలు కోసం INTUC సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్ర బొగ్గు శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల మనుగడ కోసం నూతన బొగ్గు గనుల ప్రారంభం, మెడికల్ బోర్డు సమస్య, మారుపేర్ల మార్పు, పెర్క్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ మాఫీ, సొంత ఇంటి కల సాకారం, సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా, అధికారుల PRP సమస్యతో పాటు సింగరేణి యాజమాన్యంతో IR సమావేశం ఏర్పాటు వంటి అంశాలపై INTUC ప్రతినిధులు చర్చించారు.

కార్మికులకు ఇచ్చిన హామీలను కాలపరిమితిలోగా అమలు చేయడంతో పాటు, సింగరేణి సంస్థలో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు.

INTUC ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వీలైనంత త్వరగా INTUC ప్రతినిధులు, సింగరేణి యాజమాన్యం, సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, ఒక్కో సమస్యను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం INTUC నిరంతరం ప్రభుత్వంతో చర్చిస్తూ, కార్మికులకు న్యాయం జరిగే వరకు కృషి చేస్తుందని డా. బి. జనక్ ప్రసాద్ తెలిపారు.

ఈ సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి, ధర్మపురి, త్యాగరాజన్, కాంపెల్లి సమ్మయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ వడ్డేపల్లి దాస్ పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular