Thursday, July 16, 2026

Buy now

అభివృద్ధి–మానవీయత సమన్వయంతో ముందుకు సాగుతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

* మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాది
హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధికి దిశానిర్దేశం చేసే చారిత్రాత్మక ప్రాజెక్ట్‌గా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ నగర రూపురేఖలు మారడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌కు అవసరమైన భూ సేకరణ, పునరావాస అంశాలపై మంత్రి సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేశ్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఎండీ ఈ.వి. నర్సింహారెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మూసీ నదిని పునరుజ్జీవింపజేసి, పర్యాటకం, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా మార్చాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి అని పేర్కొన్నారు.

“మూసీ ప్రాజెక్ట్ కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన, పర్యావరణహితమైన జీవన వాతావరణాన్ని అందించే సంకల్పం” అని మంత్రి తెలిపారు.

దశాబ్దాలుగా మూసీ కాలుష్యంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వరదల సమయంలో పరివాహక ప్రాంతాల ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోందన్నారు. వరద నియంత్రణ, నీటి శుద్ధి, పచ్చదనం పెంపు, రోడ్లు, పార్కులు, వాక్‌వేలు, వినోద కేంద్రాల అభివృద్ధి ద్వారా మూసీ పరివాహక ప్రాంతాలను ఆధునిక జీవన కేంద్రాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విధంగానే మూసీ ప్రాజెక్ట్ ఎవరికీ వ్యతిరేకం కాదని మంత్రి తెలిపారు. అభివృద్ధి పేరుతో పేదల జీవితాలు దెబ్బతినకుండా ప్రతి నిర్ణయం మానవీయ కోణంలోనే తీసుకుంటామని స్పష్టం చేశారు.

భూ సేకరణ ప్రక్రియలో ప్రజల ప్రయోజనాలను ప్రాధాన్యంగా తీసుకుని నిర్ణయాలు ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించి తక్షణమే అమలు చేయాలని సూచించారు.

భూములు కోల్పోయే వారికి చట్టబద్ధమైన పరిహారం, అవసరమైన పునరావాస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Related Articles

spot_img

Most Popular