గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గోదావరిఖని ఆర్ఎఫ్సీఎల్ రోడ్, శాంతినగర్‌లోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (రామగుండం బాయ్స్–1)ను సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే, అనంతరం వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం అనంతరం విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి, భోజనం నాణ్యత, వసతి, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
“మధ్యాహ్న భోజనం బాగుందా? మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నిర్భయంగా చెప్పండి. మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం” అని విద్యార్థులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు.
అనంతరం కళాశాలలోని తరగతి గదులు, వసతి గృహాలు, భోజనశాల తదితర మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

