Wednesday, July 15, 2026

Buy now

నేరాల నియంత్రణలో అప్రమత్తంగా వ్యవహరించాలి: సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

సిరిసిల్ల: నేరాల నియంత్రణలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశించారు.

బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వేములవాడ సబ్‌డివిజన్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, పోలీస్ స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి కేసులో **క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్**‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, శాస్త్రీయ ఆధారాలతో పటిష్ఠమైన దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

సీసీటీఎన్‌ఎస్ 2.0, ఈ-సాక్ష్య, నాట్‌గ్రిడ్ వంటి సాంకేతిక వనరులను సమర్థంగా వినియోగించి కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. దొంగతనం కేసులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో త్వరితగతిన ఛేదించి, దొంగిలించిన సొత్తును బాధితులకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో డీఎస్పీలు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, రవీందర్, మొగిలి, మధుకర్, ఆర్‌ఐలు మధుకర్, సురేష్, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular