* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
* డిజిటల్ సాంకేతికతను సద్వినియోగం చేసుకొని డేటా నమోదులో వేగం, ఖచ్చితత్వం పెంచాలి
* ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలును పకడ్బందీగా పర్యవేక్షించాలి
* యూపీహెచ్సీ ఏఎన్ఎంలకు ట్యాబ్‌ల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి : జిల్లాలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల (యూపీహెచ్సీ) లో పనిచేస్తున్న ఏఎన్ఎంలు ఆన్లైన్ ఆరోగ్య కార్యక్రమాల నమోదును మరింత సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. జిల్లాలోని యూపీహెచ్‌సీలలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు మంగళవారం సమగ్రత జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ట్యాబ్‌లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ఆరోగ్య శాఖకు సంబంధించిన వివిధ ఆన్లైన్ కార్యక్రమాలు, సేవల వివరాలు, గర్భిణీల నమోదు, టీకాల వివరాలు, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్య కార్యక్రమాల పురోగతి తదితర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడానికి ఈ ట్యాబ్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఆరోగ్య శాఖ కార్యక్రమాల అమలును వేగవంతం చేయడంతో పాటు, ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించేందుకు డిజిటల్ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు సేకరించే ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని సకాలంలో ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. డేటా నమోదులో వేగంతో పాటు ఖచ్చితత్వానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీల నమోదు, టీకాల కార్యక్రమాలు, కుటుంబ సంక్షేమం, ప్రజారోగ్య కార్యక్రమాలు తదితర సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు.
ఆన్లైన్లో నమోదయ్యే డేటా ఆధారంగా ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని పర్యవేక్షించే అవకాశం ఉన్నందున ప్రతి వివరాన్ని బాధ్యతగా నమోదు చేయాలని తెలిపారు. ఏఎన్ఎంలకు అందించిన ట్యాబ్‌లను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని క్షేత్రస్థాయి ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు, ఆరోగ్య కార్యక్రమాల అమలు, పర్యవేక్షణలో మరింత పారదర్శకత, ఖచ్చితత్వం సాధ్యమవుతుందని తెలిపారు.
ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందిస్తున్న సేవలపై ప్రత్యేక దృష్టి సారించి, ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వై. పవిత్ర, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, యూపీహెచ్సీల వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.

