* అంచనాలను మించిన దిగుబడులు, మంచి ఆదాయం
ప్రజానావ,పెద్దపల్లి: మండలంలోని తుర్కల మద్దికుంట గ్రామంకు చెందిన ఆయిల్ పాం రైతు కీర్తి శ్రీనివాస్ ఆయిల్ పాం తోటలో మొదటి కోత నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులకు మంచి దిగుబడులు, ఆశాజనకమైన ఆదాయం లభిస్తుండటంతో రైతుల్లో ఆనందం నెలకొంది. రైతులు ఊహించిన దానికంటే మెరుగైన రాబడులు పొందుతూ ఆయిల్‌పామ్ సాగుపై మరింత ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తూ రైతులకు వివిధ రకాల రాయితీలు, సబ్సిడీలను అందిస్తోందన్నారు. రైతులు ప్రస్తుత వర్షపాతాన్ని మాత్రమే నమ్ముకుని అధిక నీటి అవసరం ఉన్న వరి సాగు వైపు వెళ్లకుండా, భవిష్యత్‌లో స్థిరమైన ఆదాయాన్ని అందించే ఆయిల్‌పామ్ వంటి పంటల వైపు దృష్టి సారించాలన్నారు. ఆయిల్‌పామ్ అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడగల పంట. ఆయిల్‌పామ్ తోటల్లో కూరగాయలు, పప్పుజాతి పంటలు, మొక్కజొన్న, పత్తి తదితర అంతర పంటలను సాగు చేసుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు అన్నారు. పెద్దపల్లి జిల్లా పరిపాలన ప్రత్యేకంగా ఆయిల్‌పామ్ సాగు చేపట్టే ఒంటరి మహిళా రైతులకు అండగా నిలుస్తోంది. వారికి సాగు ఖర్చులను ఉచితంగా భరించడంతో పాటు, ఉద్యానశాఖ ద్వారా అందించే సబ్సిడీలను కూడా అందిస్తూ ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం ఆయిల్‌పామ్ గెలల ధర టన్నుకు రూ.23,488 గా ఉంది. ఆయిల్‌పామ్ తోటలో సాధారణంగా నాలుగో సంవత్సరం నుంచి మొదటి దిగుబడి ప్రారంభమవుతుంది. ఆయిల్‌పామ్ తోటలు 7వ సంవత్సరం వరకు ఎకరాకు సంవత్సరానికి సుమారు 6 నుంచి 8 టన్నుల దిగుబడిని ఇవ్వగలవు. ఆ తరువాత దిగుబడి ఎకరాకు సంవత్సరానికి 10 నుంచి 12 టన్నుల వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ధరలను పరిగణనలోకి తీసుకుంటే రైతులకు ఎకరాకు సంవత్సరానికి సుమారు రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం లభించే అవకాశం ఉంది. అంటే నెలకు సగటున రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఎకరాకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు ఎలాంటి సందేహాలు, అనుమానాలు లేకుండా ఆయిల్‌పామ్ సాగును చేపట్టాలని, ఇది దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్ని అందించే పంటగా నిలుస్తుందని పెద్దపల్లి జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమం లో గడ్డం శ్యామ్ ప్రసాద్,జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల అధికారి, పెద్దపల్లి, తిరుమల ఆయిల్ పాం కంపెనీ సీఈవో కేషు కల్యాంకర్, హెచ్ఈఓ రాము, ఆయిల్ పాం ఫీల్డ్ స్టాఫ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

