* మల్కాపూర్ చెక్‌పోస్టును అర్ధరాత్రి తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి: జిల్లాలో ఆస్తి సంబంధిత నేరాలను అరికట్టేందుకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు. ఇందులో భాగంగా నేరాలు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో నాకాబందీ, ప్రత్యేక చెక్‌పోస్టులు, రాత్రి వేళల్లో విస్తృత వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
కొండాపూర్ మండలం మల్కాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును జిల్లా ఎస్పీ అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో మాట్లాడిన ఆయన, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో ప్రధాన రహదారులు, గ్రామీణ–పట్టణ అనుసంధాన మార్గాలు, అలాగే జిల్లా ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఆస్తి నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, రాత్రి బీట్లు, వాహనాల తనిఖీలు, అనుమానాస్పద వ్యక్తుల గుర్తింపు, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
నేరాల నియంత్రణతో పాటు నేరాల ఛేదనలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్న ఎస్పీ, వ్యాపారులు, షాపుల యజమానులు, ప్రజలు తమ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా రాత్రి వేళల్లో అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు లేదా డయల్ 100/112కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

