* 7,340 ఇళ్లకు 35,125 దరఖాస్తులు
* మరో రెండు రోజులు మాత్రమే గడువు
* ఆగస్టు 20 తర్వాత లాటరీ
* ఏడాదిలోగా లబ్ధిదారులకు ఇళ్ల అందజేత
* హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతం
హైదరాబాద్: అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పేద ప్రజలకు సొంతింటిని కల్పించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ కోర్ పరిధిలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకానికి భారీ స్పందన లభిస్తోంది. ఈ పథకం కింద నిర్మించనున్న ఫ్లాట్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఒక లక్ష ఇళ్లను నిర్మించాలని సంకల్పించగా, పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గంలో 500 ఇళ్ల చొప్పున నిర్మాణాలను చేపడుతోంది. ఇందులో భాగంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న 7,340 ఇళ్లకు డిమాండ్ సర్వే ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. శనివారం నాటికి ఈ ఇళ్ల కోసం 35,125 దరఖాస్తులు అందాయని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతం ఒక ప్రకటనలో తెలిపారు.
రూ.6 లక్షలకే ఫ్లాట్
సొంతింటిని సమకూర్చుకోవడం కష్టతరంగా భావించే అల్పాదాయ వర్గాల ప్రజలకు అందుబాటులో, అతి తక్కువ ధరకు ఇల్లు అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు గౌతం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఇటువంటి పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి నియోజకవర్గంలో విలువైన భూముల్లో నిర్మిస్తున్న ఈ ఇళ్లను నామమాత్రపు ధరకే అందిస్తున్నామని తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.30 లక్షల నుంచి రూ.58 లక్షల వరకు ధర పలికే ఫ్లాట్లను ప్రజల సంక్షేమం, జీవన ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా కేవలం రూ.6 లక్షలకే ప్రభుత్వం కేటాయిస్తోందని వివరించారు.
ఇళ్లను పొందిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ కూడా చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు సొంతింటి కోసం తాము నివసిస్తున్న ప్రాంతాల నుంచి వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా, ప్రస్తుతం తాము నివసిస్తున్న నియోజకవర్గంలోనే సొంతింటిని పొందే అవకాశం ఈ పథకం ద్వారా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
కుల, ఆదాయ ధ్రువపత్రాలు అవసరం లేదు
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే సమయంలో కుల, ఆదాయ ధ్రువపత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదని గౌతం స్పష్టం చేశారు. ఇల్లు కేటాయింపు జరగని పక్షంలో దరఖాస్తుదారులు చెల్లించిన రూ.10,000 డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని తెలిపారు.
దరఖాస్తుల సమర్పణకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున అర్హులైన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆగస్టు 20 తర్వాత లాటరీ.. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి
ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూనే, ఇళ్ల కేటాయింపు, నిర్మాణాలకు సంబంధించిన కార్యాచరణపై హౌసింగ్ బోర్డు చర్యలు చేపడుతోంది. దరఖాస్తుదారులకు ఇళ్ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను ఆగస్టు 20వ తేదీ తర్వాత ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు గౌతం తెలిపారు.
అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్ ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు. మొత్తం ఇళ్ల నిర్మాణాలను ఒక ఏడాది లోపే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు వైస్ చైర్మన్ తెలిపారు.
నియోజకవర్గాల వారీగా దరఖాస్తులు
ఖైరతాబాద్: 4,394
అంబర్‌పేట: 2,357
బహదూర్‌పుర: 1,135
ఇబ్రహీంపట్నం: 749
కూకట్‌పల్లి: 5,233
కార్వాన్: 1,574
మహేశ్వరం: 471
మలక్‌పేట: 2,846
మల్కాజిగిరి: 1,033
మేడ్చల్: 1,153
నాంపల్లి: 3,613
సనత్‌నగర్: 1,046
కుత్బుల్లాపూర్: 4,121
రాజేంద్రనగర్: 1,496
సికింద్రాబాద్ కంటోన్మెంట్: 1,374
శేరిలింగంపల్లి: 2,530
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు హెల్ప్‌లైన్ నంబర్ 040-24603572ను సంప్రదించవచ్చని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతం సూచించారు.

