హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో స్టీల్, సిమెంట్ పరిశ్రమలు సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హౌసింగ్ శాఖ కార్యదర్శి వి.పి. గౌతమ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, టీజీఐఐసీ ఎండీ శశాంకతో కలిసి స్టీల్, సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి ధరలు, సరఫరా, నాణ్యత, పరిశ్రమల సహకారం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ఇది కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదని, పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం, సామాజిక భద్రత, ఆత్మగౌరవాన్ని కల్పించే మహాయజ్ఞమని పేర్కొన్నారు.
అందువల్ల స్టీల్, సిమెంట్ పరిశ్రమలు సామాజిక బాధ్యతతో ముందుకొచ్చి రాయితీ ధరలకు నాణ్యమైన నిర్మాణ సామగ్రిని అందించాలని ఆయన కోరారు. పరిశ్రమలు ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం ద్వారా వేలాది నిరుపేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతుందని తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 శాతం సబ్సిడీతో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టలేదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తే తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని త్వరితగతిన సాధించవచ్చని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రతి వర్గం సహకరించాలని పిలుపునిచ్చారు.
పేదలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం అందించే పరిశ్రమలను ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని పేర్కొన్న మంత్రి, హౌసింగ్ అధికారులు పరిశ్రమల యాజమాన్యాలతో సమన్వయం చేసుకొని లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి సకాలంలో చేరేలా కార్యాచరణ ప్రణాళిక (రోడ్‌మ్యాప్) రూపొందించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ బృహత్తర ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగస్వామ్యం కావడానికి స్టీల్, సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు.

