మేడ్చల్-మల్కాజిగిరి: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి, ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
అలాగే అభివృద్ధి పనులు నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించిన మంత్రి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి పనిని పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.

