Thursday, July 16, 2026

Buy now

ఎల్‌నీనో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్:ఎల్‌నీనో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతులు భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేస్తున్న వర్షపాతం అంచనాలు, హెచ్చరికలు, సూచనలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని సాగు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఎల్‌నీనో పరిస్థితులు, వర్షపాతం, నీటి లభ్యత, వ్యవసాయ కార్యాచరణపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్, సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్, ఇంజినీర్-ఇన్-చీఫ్ రమేష్ బాబు, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కూడా హాజరయ్యారు.

అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి, జిల్లా వారీ కార్యాచరణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రతి జిల్లాలో వర్షపాతం, భూగర్భ జలాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, సాగునీటి లభ్యతను నిరంతరం సమీక్షించి, వాటికి అనుగుణంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, గ్రామసభలు, రైతు వేదికలు, క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాల ద్వారా రైతులకు విస్తృతంగా వివరించాలని అధికారులను ఆదేశించారు.

వాతావరణ, వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేసి శాస్త్రీయ సమాచారాన్ని వేగంగా రైతులకు చేరవేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఏ ప్రాంతంలో ఏ పంట అనుకూలమో వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫారసుల మేరకే రైతులకు సూచనలు అందించాలని చెప్పారు. వదంతులను నమ్మకుండా అధికారుల మార్గదర్శకాల మేరకే సాగు నిర్ణయాలు తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

రిజర్వాయర్లలోని వాస్తవ నీటి నిల్వలపై రైతులకు పారదర్శక సమాచారం అందించి, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని సాగు ప్రణాళికలు రూపొందించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమైన వెంటనే శ్రీపాద ఎల్లంపల్లి సహా గోదావరి బేసిన్‌లోని ప్రధాన జలాశయాలను సమర్థవంతంగా నింపేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి పేర్కొన్నారు.

ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్‌నీనో సవాళ్లను శాస్త్రీయ ప్రణాళికతో ఎదుర్కొని రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తుందని పునరుద్ఘాటించారు.

Related Articles

spot_img

Most Popular