* కిరాణా దుకాణాలు, పాన్ షాపులు, బస్టాండ్, విద్యాసంస్థల పరిసరాల్లో తనిఖీలు
* డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు పోలీసుల ప్రత్యేక చర్యలు
* మాదకద్రవ్యాల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి
సిరిసిల్ల: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితె ఆదేశాల మేరకు ఆర్‌ఐ (అడ్మిన్) ఆధ్వర్యంలో నార్కోటిక్ జాగిలం సహాయంతో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కిరాణా దుకాణాలు, పాన్ షాపులు, బస్టాండ్, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, జిల్లాలో డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, క్రయవిక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రజా రద్దీ ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాల్లో నార్కోటిక్ జాగిలాల సహాయంతో తరచూ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని పేర్కొంటూ, వాటి దుష్పరిణామాలపై విద్యార్థులు, యువత, ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
డ్రగ్స్ లేదా గంజాయి విక్రయం, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా **తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 8712671111**కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

