ప్రజనావ,హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న ‘ఎల్ నినో’ వంటి మార్పుల ప్రభావం తెలంగాణపై, ముఖ్యంగా వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో సమగ్ర కార్యాచరణ రూపొందిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల నుంచి తెలంగాణ సంసిద్ధత వరకు” అనే అంశంపై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సుకు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన భట్టి విక్రమార్క పలు కీలక అంశాలను వెల్లడించారు.
ప్రజల్లో అవగాహనే ప్రభుత్వ లక్ష్యం:
కేవలం పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, ఎల్ నినో ప్రభావంపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి తెలిపారు. సమస్య తీవ్రతను ముందుగానే అర్థం చేసుకుంటే ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం స్వయంగా ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
భూమధ్యరేఖ సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల మార్పులు తెలంగాణలోని చెరువులు, వాగులు, గ్రామీణ జీవనంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో శాస్త్రవేత్తల ద్వారా విశ్లేషించి, అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించారు.
వ్యవసాయానికి ముందస్తు ప్రణాళికలు:
వర్షాభావ పరిస్థితులు ఎదురైనా రైతులు నష్టపోకుండా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. తాగునీరు, సాగునీటితో పాటు పశువులు, పక్షులు, అడవి జంతువులకు నీరు, ఆహారం కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వ్యక్తిగత, కుటుంబ, గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రజలు సంసిద్ధమయ్యేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
సోలార్ విద్యుత్‌తో ఆర్థిక భారం తగ్గింపు:
ఎల్ నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ అమలు చేస్తోందని భట్టి తెలిపారు. పగటి పూట తక్కువ ధరకు లభించే సౌర విద్యుత్‌ను గరిష్టంగా వినియోగించడం ద్వారా ప్రజలపై, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం తగ్గుతుందని చెప్పారు. సోలార్ విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ, అవసరమైన సమయంలో థర్మల్ విద్యుత్‌ను క్రమబద్ధంగా ఉపయోగించడం ద్వారా విద్యుత్ గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడుతున్నామని వివరించారు.
వర్షాకాలంలోనూ వేసవి స్థాయి విద్యుత్ డిమాండ్:
ఉష్ణోగ్రతలు పెరగడంతో ఫ్యాన్లు, ఏసీలు, బోర్‌వెల్స్, లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల వినియోగం అధికమై, సాధారణంగా వర్షాకాలంలో ఉండే డిమాండ్‌కు బదులుగా ప్రస్తుతం వేసవి గరిష్ట స్థాయిలో విద్యుత్ అవసరం నమోదవుతోందని తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎనర్జీ ప్లానింగ్‌లో తెలంగాణ ముందంజలో ఉందని పేర్కొన్నారు.
జిల్లాల వారీగా అవగాహన సదస్సులు:
సమాజంలో చైతన్యం తీసుకురావడానికి నిపుణులను ఆహ్వానించి ఈ సదస్సును నిర్వహించిన ప్లానింగ్ శాఖను భట్టి విక్రమార్క అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి అవగాహన సదస్సులను జిల్లాల వారీగా నిర్వహించి ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ఐఏఎస్ అధికారులు దివ్య దేవరాజన్, గోపి, జితేష్ వి. పాటిల్, ప్లానింగ్ డైరెక్టర్ రూఫస్ దత్తం తదితరులు పాల్గొన్నారు.

