* జూలై 19న ‘పోలీస్ యువశక్తి’ ఎంపిక ప్రక్రియ.. పెద్దపల్లి జిల్లా అభ్యర్థులకే అవకాశం
పెద్దపల్లి:పోలీస్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న యువత **ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని** పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న పెద్దపల్లి జిల్లా యువత కోసం నిర్వహించనున్న “పోలీస్ యువశక్తి” ఉచిత శిక్షణ ఎంపిక కార్యక్రమం పోస్టర్‌ను బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన అభ్యర్థులకు నాణ్యమైన ఉచిత శిక్షణ అందించడం ద్వారా రాష్ట్ర పోలీస్ నియామకాల్లో పెద్దపల్లి జిల్లా నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులు విజయం సాధించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉచిత శిక్షణ కోసం జూలై 19 (ఆదివారం) ఉదయం 6 గంటలకు గోదావరిఖనిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం (సీఈఆర్ క్లబ్)లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముందుగా ఫిజికల్ టెస్ట్, అనంతరం రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు.
పురుష అభ్యర్థులకు 1,600 మీటర్ల పరుగు, మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికి అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఉచిత కోచింగ్, స్టడీ మెటీరియల్, ఫిజికల్ ట్రైనింగ్ తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ అవకాశం పెద్దపల్లి జిల్లా అభ్యర్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఆసక్తి గల అభ్యర్థులు జూలై 17, 2026లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
మరిన్ని వివరాలకు **83330 44460, 99497 25997, 81068 07784, 95736 88952** నంబర్లను సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రవీణ్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, మహిపాల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

