* తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
* పెండింగ్ సంక్షేమ నిధుల పూర్తి వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశం
* గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ పాఠశాలల్లో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండరాదు
* ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుపై స్పష్టమైన ఆదేశాలు
* ఐడీఓసీలో జిల్లా అధికారులతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష
పెద్దపల్లి: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు.
శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రాంరెడ్డి, అదనపు కలెక్టర్లు బి. శ్రీరాములు, జె. అరుణ శ్రీలతో కలిసి జిల్లా అధికారులతో ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని వివరించారు.
సమావేశంలో గురుకులాలు, సంక్షేమ, గిరిజన రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీలు), మోడల్ పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించి ఎస్సీ, ఎస్టీ బాధితుల పరిహారానికి సంబంధించిన 50 శాతం నిధులను విడుదల చేయించినట్లు తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఓవర్సీస్ విద్యా పథకం, ఎస్సీ, ఎస్టీ బాధితుల పరిహారం, గురుకుల విద్యాసంస్థలకు సంబంధించిన పెండింగ్ నిధుల పూర్తి వివరాలను వెంటనే కమిషన్‌కు సమర్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఈ నెలాఖరులో ముఖ్యమంత్రితో సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో పెండింగ్ నిధుల విడుదల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మిగిలిన నిధులు కూడా విడుదలయ్యేలా కృషి చేస్తామని తెలిపారు.
జిల్లాలోని గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ పాఠశాలల్లో ఒక్క సీటు కూడా ఖాళీగా లేకుండా పూర్తి సామర్థ్యంతో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు అమలులో ఉన్న రిజర్వేషన్లను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అలాగే ఉపాధి కల్పన కార్యాలయం, వారధి సొసైటీ ద్వారా భర్తీ చేసే అన్ని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద అందిన ఫిర్యాదులపై వెంటనే కేసులు నమోదు చేసి, సత్వర విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. నిజమైన బాధితులకు చట్టబద్ధంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, అలాగే చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కమిషన్ సూచించిన మేరకు పెండింగ్ నిధుల పూర్తి వివరాలను సేకరించి నిర్ణీత గడువులో కమిషన్‌కు సమర్పిస్తామని చెప్పారు. విద్య, ఉపాధి, సంక్షేమం, జీవనోపాధి, గురుకుల విద్యాసంస్థల బలోపేతంతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధికి జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిళ్లా శంకర్, రేణికుంట ప్రవీణ్, ఆర్డీవోలు బి. గంగయ్య, సురేష్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్, ఏసీపీ రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

