ములుగు: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం–2026లో భాగంగా చేపడుతున్న ఓటరు జాబితా రూపకల్పనలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ములుగు జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పూర్తి చేయాలని సూచించారు. ఎన్యుమరేషన్ ఫారాల్లో అన్ని వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయడంతో పాటు బూత్ లెవల్ అధికారుల (బీఎల్‌వోలు) సంతకాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు, గుర్తించలేని వారు, మరణించిన వారి జాబితాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని, మారిన ఓటర్ల జాబితాపై బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏలు) సంతకాలు తీసుకోవాలని సూచించారు. మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో నమోదై ఉంటే వారందరినీ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే వీవీఐపీలు, వీఐపీల ఓటరు మ్యాపింగ్‌ను సహాయ ఎన్నికల నమోదు అధికారులు స్వయంగా పరిశీలించి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని ఆదేశించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియలను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో ఎన్నికల నమోదు అధికారి ఆర్డీవో కృష్ణవేణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

