* దేవదుర్గ బ్లాక్ అన్వేషణకు కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖతో ఒప్పందం
* ఐదేళ్లలో అన్వేషణ పూర్తి చేస్తాం: డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు
సింగరేణి భవన్,హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్, యాదగిరి జిల్లాల్లో విస్తరించి ఉన్న దేవదుర్గ బ్లాక్లో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ వేలంలో అన్వేషణ లైసెన్స్ పొందిన నేపథ్యంలో, అన్వేషణ పనులను ప్రారంభించేందుకు కర్ణాటక రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖతో గురువారం ఒప్పందం కుదుర్చుకుంది.
బెంగళూరులోని కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక డీఎంజీ డైరెక్టర్ రంగప్ప, సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) వెంకటేశ్వర్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం, సింగరేణికి కేటాయించిన 199.13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని దేవదుర్గ బ్లాక్లో ఐదేళ్లలో ఖనిజ అన్వేషణను పూర్తి చేయనున్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దేవదుర్గ ప్రాంతంలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు అవసరమైన అన్ని అనుమతులు పూర్తయ్యాయని, ఇప్పుడు క్షేత్రస్థాయిలో అన్వేషణ ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరిందని తెలిపారు.
ఇప్పటికే అవసరమైన అధికారులను నియమించామని, త్వరలో మిగిలిన సిబ్బందిని కూడా నియమించి రెండేళ్లలోపు జీ-4 (G4) దశ అన్వేషణను విజయవంతంగా పూర్తి చేస్తామని వెల్లడించారు.
ఇతర రాష్ట్రంలో ఈ స్థాయిలో ఖనిజ అన్వేషణ చేపట్టడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొన్న ఆయన, 130 ఏళ్లకు పైగా అన్వేషణ అనుభవం కలిగిన సంస్థగా ఈ ప్రాజెక్టును కూడా విజయవంతంగా పూర్తి చేస్తామనే విశ్వాసం వ్యక్తం చేశారు. సహకరించిన కర్ణాటక ప్రభుత్వం, మైన్స్ అండ్ జియాలజీ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.
అన్వేషణలో భాగంగా రిమోట్ సెన్సింగ్, జియోలాజికల్ మ్యాపింగ్, జియోఫిజికల్ సర్వేలు నిర్వహించి, ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్కౌట్ డ్రిల్లింగ్ చేపడతారు. అనంతరం సేకరించిన నమూనాలపై పెట్రోగ్రాఫిక్, మినరలాజికల్ అధ్యయనాలతో పాటు సమగ్ర మూలకాల విశ్లేషణ చేపట్టనున్నారు.
ఈ విశ్లేషణలను కొత్తగూడెంలో ఇటీవల ఏర్పాటు చేసిన సింగరేణి జియోసైన్స్ ల్యాబొరేటరీలో నిర్వహిస్తారు. అనంతరం రూపొందించే సమగ్ర నివేదికను కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖకు సమర్పించనుండగా, ఆ నివేదిక ఆధారంగా తదుపరి విస్తృత స్థాయి అన్వేషణ చేపట్టే అవకాశం ఉంటుంది.ఈ కార్యక్రమంలో ఎక్స్ప్లోరేషన్ జీఎం పంకజ్ కులశ్రేష్ట, డీజీఎం (జియాలజీ) వి. రాజేశ్వర్, డీవైఎఫ్ఎం లక్ష్మీప్రియ, సీనియర్ లా ఆఫీసర్ ప్రభందిత తదితరులు పాల్గొన్నారు.

