ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని అన్ని పంపులను వెంటనే ఆన్ చేసి, 24 గంటల పాటు నిరంతరాయంగా నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, నాయకుడు డాక్టర్ కురువ విజయ్ కుమార్ తదితర బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం స్టేజ్-3 పంప్‌హౌస్, గుడిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడారు. ఎల్ నినో విపత్తు ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం మొద్దునిద్ర వీడి వెంటనే అన్ని రిజర్వాయర్లను నింపి సాగునీరు అందించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనత వల్ల శ్రీశైలం నుంచి ఏపీకి 70 టీఎంసీల నీరు తరలిపోతుంటే, తెలంగాణకు మాత్రం 7 టీఎంసీలు కూడా రాలేదని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తయినా మిగతా 10 శాతం పనులు పూర్తి చేయకుండా నీటిని నింపడం లేదన్నారు. బీఆర్ఎస్ బృందం వస్తుందని తెలిసే అధికారులు మోటార్లు ఆన్ చేశారని గుడిపల్లి రైతులు నేతలకు వివరించారు.

