Tuesday, July 21, 2026

Buy now

కాంగోలో ఎబోలా విజృంభణ

– 930కు చేరిన మరణాలు
– 24 గంటల్లో 37మంది మృతి
– 2,344కు చేరిన కేసుల సంఖ్య

బునియా: కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి ఆందోళనకర స్థాయికి చేరుకుంది. తాజా పరిస్థితుల్లో వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య కనీసం 930కు చేరినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. శనివారం నాటికి మొత్తం 2,344 ఎబోలా కేసులు నమోదుకాగా, గత 24 గంటల్లోనే మరో 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. తూర్పు కాంగోలో మే 15న ఎబోలా వ్యాప్తిని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి వ్యాధి అత్యంత వేగంగా విస్తరిస్తోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం వ్యాపిస్తున్న బుండిబుగ్యో వైరస్కు ఇప్పటివరకు ఆమోదిత టీకా గానీ, నిర్దిష్ట చికిత్స గానీ అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ బారినపడి ఇప్పటివరకు 36 మంది ఆరోగ్య సిబ్బంది కూడా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వివరాల ప్రకారం, కొత్తగా నమోదవుతున్న కేసుల్లో సుమారు 80 శాతం వరకు వ్యాధి వ్యాప్తి మూలాన్ని గుర్తించలేని పరిస్థితి నెలకొంది. తిరుగుబాటుదారుల హింస, ఆరోగ్య సిబ్బందిపై దాడులు, వేతనాల సమస్యలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం 724 మంది బాధితులు ఐసోలేషన్‌ కేంద్రాలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని కాంగో ప్రభుత్వం తెలిపింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత విస్తరిస్తూ పర్యవేక్షణ చర్యలను ముమ్మరం చేసినట్లు వెల్లడించింది.

Related Articles

spot_img

Most Popular