Sunday, October 4, 2026

Buy now

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ధనిక రాష్ట్రం నుంచి తీవ్ర దివాళా దిశగా పయనిస్తోంది

* మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

పెద్దపల్లి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ తీవ్ర దివాళా దిశగా పయనిస్తోందని, తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలకు గులాంగిరీ చేస్తోందని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం పెద్దపల్లి పట్టణంలోని ‘సర్వాయి పాపన్న’ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం స్థానిక బి.ఆర్.ఎస్ జిల్లా కార్యాలయంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

​ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ కాళేశ్వరం, పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుల మోటార్లను కావాలనే ఆన్ చేయడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరంలో చిన్న పిల్లర్ రిపేర్ చేయిస్తే సరిపోయే దానికి, కేవలం కేసీఆర్ పై కక్షసాధింపుతో ఉత్తర తెలంగాణ మొత్తాన్ని ఎండబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్ర సంస్థల నివేదికలు కూడా స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. శ్రీశైలంలో డ్రింకింగ్ వాటర్ పేరు చెప్పి తెలంగాణకు నీళ్లు ఇవ్వకుండా, మరోవైపు పోతిరెడ్డిపాడు, వెలుగొండ టన్నెల్స్ ద్వారా రోజుకు 1-2 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తుంటే ఈ ప్రభుత్వం కనీసం ప్రశ్నించకుండా చూస్తూ ఊరుకుంటోందని విమర్శించారు.

​ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ముఖం చెల్లకుండా కేసీఆర్ గారిపై అబాండాలు వేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. విద్యార్థులు, నిరుద్యోగులు సభలు పెట్టుకుంటామంటే పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం, కేసీఆర్ గారి ఫామ్‌హౌస్‌పై దాడులు చేయడానికి ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిని, కేసీఆర్ గారిని ముట్టుకుంటే తెలంగాణ మళ్లీ అగ్నిగుండం అవుతుందని, అలాంటి కుట్రలు చేస్తే ఎవ్వరూ మిగలరని హెచ్చరించారు.

అలాగే జిల్లాల్లో భూ దాహంతో కోటి ఎకరాల భూములను 22 ఎ (నిషేధిత జాబితా) కింద పెట్టి రైతులను, ప్రజలను వేధిస్తున్నారని, ఎవ్వరూ భయపడి భూములను లేదా పర్సంటేజీలను నాయకులకు, అధికారులకు ఇవ్వవద్దని కోరారు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 22 ఎ నిబంధనలను, హైడ్రాని పూర్తిగా రద్దు చేసి పాతాళ గంగలో కలిపేస్తామని అభయమిచ్చారు.​కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయ నాయకుల మాటలు విని చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే రేపు జైలుపాలు కావాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు.

నిరుపేదల దగ్గర, అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని ఒంగబెట్టి కక్కిస్తామని, చట్టబద్ధంగా అధికారుల జాబితా తయారు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్ కిట్, రైతుబీమా, రైతుబంధు లాంటి సంక్షేమ పథకాలను రద్దు చేసి, బిసి సబ్‌ప్లాన్, 42 శాతం రిజర్వేషన్లు, గొర్రెల పంపిణీ వంటి హామీలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం విర్రవీగడం మానేసి, పరిపాలన, ఉద్యోగ రిక్రూట్‌మెంట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, సంక్షేమ హామీల నెరవేర్పుపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

మేమంతా జైళ్లకు, కేసులకు భయపడకుండా గొంతు పట్టి తెలంగాణ తెచ్చుకున్నామని, అధికారం ఉందని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ​ఈ విలేకరుల సమావేశంలో జిల్లా బి.ఆర్.ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular