Friday, September 4, 2026

Buy now

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విజయోత్సవం

* దేవరుప్పులలో ఘనంగా సంబరాలు.. పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

దేవరుప్పుల: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పీసీసీ ఆదేశాల మేరకు దేవరుప్పుల మండల కేంద్రంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.

ముందుగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను పురస్కరించుకుని విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.

ఆరు గ్యారెంటీల అమలుకు కృషి:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసానికి ప్రతీకగా 1000 రోజుల పాలన నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకమైన, ప్రజా అనుకూల పాలన అందిస్తున్నామని తెలిపారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, పంట రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.

విద్యార్థులు, యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలాంటి వివక్ష లేకుండా అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:
గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన అనేక రంగాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాడిలో పెడుతోందని ఎమ్మెల్యే అన్నారు. రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, యువత అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular