భూపాలపల్లి:జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినుల కోసం షీ టీం–భరోసా సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా షీ టీం ఎస్సై ఫజల్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్సై ఫజల్ ఖాన్ మాట్లాడుతూ విద్యార్థినులకు **గుడ్ టచ్–బ్యాడ్ టచ్**, వీధి వేధింపులు (స్ట్రీట్ హరాస్‌మెంట్), మహిళల భద్రత, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, ఓటీపీలు తదితర సమాచారాన్ని ఎవరికీ పంచుకోవద్దని సూచించారు.
విద్యార్థినులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. తల్లిదండ్రులు తమ కోసం పడుతున్న కష్టాన్ని గుర్తించి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, సమాజంలో ఆదర్శప్రాయమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
మహిళలు, బాలికలపై ఎవరైనా అసభ్యంగా లేదా అనుచితంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా వెంటనే జిల్లా షీ టీంను “8712658162” నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పాఠశాలల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 సేవలను వినియోగించాలని, ప్రతి విద్యార్థి అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
అదేవిధంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ మోసాలు, నకిలీ లింకులు, ఫేక్ అకౌంట్లు, డిజిటల్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే **1930** టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా షీ టీం ఎస్సై ఫజల్ ఖాన్, భరోసా బృందం సభ్యులు, షీ టీం సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

