# గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలపై TGBKS వ్యవస్థాపక కన్వీనర్ కేంగర్ల మల్లయ్య విమర్శలు
గోదావరిఖని: సింగరేణి యాజమాన్యం కార్మికులను ఏకపక్షంగా డిస్మిస్ చేస్తున్నప్పటికీ గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు స్పందించకపోవడం దారుణమని తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య (TGBKS) వ్యవస్థాపక కన్వీనర్ కేంగర్ల మల్లయ్య విమర్శించారు. కార్మికుల సమస్యలపై ఆయా సంఘాల నాయకులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు.
TGBKS నాయకుడు దాసరి నర్సయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన GDK-2 ఇంక్లైన్ బాయ్‌కాట్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేంగర్ల మల్లయ్య కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఎంతో కష్టపడి సాధించుకున్న డిపెండెంట్ ఉద్యోగాలను డిస్మిస్ పేరుతో కోల్పోవడం బాధాకరమన్నారు.
ఉన్నత చదువులు చదివిన డిపెండెంట్లు సింగరేణి వంటి కష్టతరమైన ఉద్యోగాల్లో తక్కువ సమయంలోనే స్థిరపడటం కష్టమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తాము సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో డిస్మిస్ విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు.
ఒక సంవత్సరంలో 100 మాస్టార్లు లేకపోతే డిస్మిస్ చేసే విధానాన్ని రద్దు చేయించి, మూడు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సంవత్సరంలోనైనా 100 మాస్టార్లు ఉంటే డిస్మిస్ చేయకూడదనే నిబంధనను యాజమాన్యంతో అంగీకరింపజేశామని మల్లయ్య పేర్కొన్నారు. తాము గుర్తింపు సంఘంగా ఉన్న పదేళ్ల కాలంలో ఒక్క ఉద్యోగం కూడా పోకుండా కార్మికుల కుటుంబాలను కాపాడామని తెలిపారు.
అయితే రెండేళ్ల క్రితం ఎన్నికైన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు ఇప్పటివరకు సుమారు 200 మంది కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేశాయని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కూడా ఏ ఒక్క సంవత్సరం మాస్టార్లు లేకపోయినా ఉద్యోగం నుంచి తొలగిస్తామని యాజమాన్యం బెదిరింపులకు దిగుతోందని, దీనిని వ్యతిరేకించాల్సిన సంఘాలు తమ వ్యక్తిగత పైరవీలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శించారు.
గత రెండేళ్లుగా ఒక్క మెడికల్ బోర్డులో కూడా కార్మికులకు సరైన న్యాయం జరగడం లేదని మల్లయ్య అన్నారు. అరకొరగా అన్‌ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి వేచి చూసే పరిస్థితి నెలకొందని తెలిపారు. గతంలో AITUC ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితులకు కారణమైన విధంగానే ప్రస్తుతం కూడా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
కార్మికుల హక్కుల కోసం పోరాడిన అనుభవంతోనే తాము కార్మికుల మధ్యకు వస్తున్నామని మల్లయ్య తెలిపారు. యూనియన్లు, రాజకీయ పార్టీలకు అతీతంగా కార్మికులు TGBKSను ఆదరించి, తమ హక్కుల పరిరక్షణ కోసం సంఘంతో కలిసి పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో దొడ్ల సతీష్, రామగిరి విజయభాస్కర్, దాసరి అఖిల్, జక్కుల శంకర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

