సమతుల్య విధానంతోనే పారిశ్రామిక ప్రగతి*
లేబర్ కోడ్స్‌పై తొందరపాటు నిర్ణయాలు ఉండవు
భాగస్వాముల సూచనలతోనే నిబంధనల రూపకల్పన
కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్ మరియు గనుల శాఖ గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్: కార్మికుల సంక్షేమంతోపాటు పరిశ్రమల ప్రయోజనాలను పరిరక్షించేలా సమతుల్య విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్ మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. పరిశ్రమలు సజావుగా, లాభదాయకంగా కొనసాగితేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, కార్మికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కార్మిక చట్టాల (లేబర్ కోడ్స్)పై హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో మంగళవారం నిర్వహించిన భాగస్వాముల సంప్రదింపుల సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని మాట్లాడారు. కార్మిక న్యాయస్థానాలకు సంబంధించిన అంశాలు, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర ప్రభుత్వానికి చేయాల్సిన సిఫార్సులు, రూపొందించాల్సిన నిబంధనలపై విస్తృతంగా చర్చ జరగాలని సూచించారు.
‘‘యాజమాన్యాలు, కార్మికులు పరస్పరం చర్చించుకొని సహేతుకమైన నిర్ణయాలకు వస్తే పరిశ్రమలకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పరిశ్రమలు బాగా నడిస్తే కార్మికులు సంతోషంగా ఉంటారు. పరిశ్రమల విస్తరణతోపాటు కార్మికులకు మరిన్ని సౌకర్యాలు అందించవచ్చు” అని మంత్రి పేర్కొన్నారు.
లేబర్ కోడ్స్‌పై పారిశ్రామిక వర్గాలు, కార్మిక సంఘాలు ఎలాంటి సంకోచం లేకుండా తమ సూచనలు, అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు. అదే సమయంలో కార్మికుల ప్రయోజనాలను తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. కార్మికులు, పరిశ్రమలు.. ఇరువర్గాలకు మేలు చేసే సమతుల్య విధానమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా పరిశ్రమల అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను సిద్ధం చేసేందుకు పారిశ్రామిక సంఘాలతో నెలలుగా చర్చలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు ఏయే రంగాల్లో, ఎలాంటి నైపుణ్యాలు అవసరమో గుర్తించి యువతకు శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ) ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు.
కనీస వేతనాల అంశంలోనూ ప్రభుత్వం ఇదే సంప్రదింపుల విధానాన్ని అనుసరించిందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. పారిశ్రామిక సంఘాలు, ఇతర భాగస్వాములతో విస్తృతంగా చర్చించిన తర్వాతే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. గత పదేళ్లుగా కనీస వేతనాల్లో పెంపు లేకపోవడంతో కార్మికుల నుంచి అనేక డిమాండ్లు వచ్చాయని గుర్తుచేశారు. కార్మికుల అవసరాలు, పరిశ్రమల పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని సమతుల్య ప్రతిపాదనను రూపొందించామని తెలిపారు. ప్రభుత్వ ప్రతిపాదనకు సహకరించిన పారిశ్రామిక సంఘాలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
‘‘లేబర్ కోడ్స్‌ను హడావుడిగా అమలు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. ప్రతి అంశంపై సమగ్రంగా చర్చ జరగాలి. అవసరమైతే నిర్దిష్ట అంశాలపై సూచనలను లిఖితపూర్వకంగా ఇవ్వండి. వాటిపై మరోసారి చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయానికి వస్తాం’’ అని కార్మిక సంఘాల నేతలకు, పారిశ్రామిక వర్గాలకు మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించిన పారిశ్రామిక సంస్థల ప్రతినిధులకు, కార్మిక సంఘాల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

