Thursday, July 16, 2026

Buy now

కాళేశ్వరం కేసీఆర్ ఫ్యామిలీ ప్యాకేజీ.. రైతులను మోసం చేశారు: ప్రభుత్వ విప్ విజయరమణరావు

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా “ఫ్యామిలీ ప్యాకేజీ”గా ఉపయోగించుకుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆరోపించారు. హైదరాబాద్ అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం పేరుతో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను తప్పుదోవ పట్టించి మోసం చేశారని విమర్శించారు.

ఆయన మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞం కింద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందని, 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.38 వేల కోట్లతో డీపీఆర్ సిద్ధం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో పక్కనపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.1.04 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినప్పటికీ రైతులకు ఆశించిన ప్రయోజనం అందలేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పాలనలో నాలుగేళ్లలో కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసిన నీరు కేవలం 162 టీఎంసీలేనని, అందులో 63 టీఎంసీలను తిరిగి నదిలోకి వదిలేయడంతో నికరంగా 74 టీఎంసీల నీరే వినియోగించారని పేర్కొన్నారు. ఎల్లంపల్లి నీటిని కూడా కాళేశ్వరం నీటిగా చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు.

“పెద్ద ఇంజనీర్ కేసీఆర్ అయితే, చిన్న ఇంజనీర్ హరీశ్ రావు” అంటూ ఎద్దేవా చేసిన విజయరమణ రావు, కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా కాళేశ్వరం పేరుతో రైతులను మోసం చేశారని అన్నారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితిపై ప్రస్తావిస్తూ, మేడిగడ్డలో 19వ పిల్లర్ కుంగిపోయిన తర్వాత ఎన్డీఎస్ఏ నివేదిక బ్యారేజీలు పనికిరావని స్పష్టం చేసినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఆ నివేదికను దాచిపెట్టిందని ఆరోపించారు. మేడిగడ్డ వైపు ఎవరినీ వెళ్లనివ్వకుండా వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని అన్నారు.

కాళేశ్వరం కోసం తీసుకున్న అప్పుల కారణంగా తమ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.33,574 కోట్లతో పాటు రూ.417 కోట్ల వడ్డీ చెల్లించిందని తెలిపారు. కేవలం 74 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు రూ.9 వేల కోట్ల విద్యుత్ చార్జీలు చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఉంటే ఈ వ్యయం సగానికి కూడా వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన ఆయన, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా విడుదల చేసిందన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పూర్తి చేసి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి వరకు నీటిని తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

ఎల్‌నినో ప్రభావంపై ప్రభుత్వం ముందుగానే రైతులకు అవగాహన కల్పిస్తోందని, రైతులను రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ లక్ష్యమని విమర్శించారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల మినహా మిగతా ప్రాంతాలకు కాళేశ్వరం ద్వారా ఎంత నీరు అందిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

చివరగా, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి ప్రాజెక్టులు ఇప్పటికీ బలంగా నిలిచాయని, బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన చెక్‌డ్యాంలు కొట్టుకుపోయాయని ఆరోపించారు. ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదని, కాళేశ్వరం అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదని విజయరమణ రావు అన్నారు.

Related Articles

spot_img

Most Popular