* ఘనంగా ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు.. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల: ప్రజాకవి, తెలంగాణ భాషా యోధుడు కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కాళోజీ తన రచనలు, కవిత్వం ద్వారా సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చారని కొనియాడారు. సమాజంలోని సమస్యలను తన కలం ద్వారా ఎత్తిచూపి ప్రజలను ఆలోచింపజేసిన మహనీయుడిగా కాళోజీ నిలిచిపోయారని పేర్కొన్నారు.
తెలంగాణ భాష, యాస, సంస్కృతిపై కాళోజీకి ఉన్న అభిమానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ అన్నారు. కాళోజీ ఆశయాలు, ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు.కార్యక్రమంలో సీపీఓ శ్రీనివాస చారి, ఏడీ మైన్స్ క్రాంతి కుమార్, డీవైఎస్ఓ రాందాస్, పరిశ్రమల శాఖ జీఎం హన్మంతు, జిల్లా వైద్యాధికారి ఏంజెలా అల్ఫ్రెడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, కలెక్టరేట్ పర్యవేక్షకులు ఉమారాణి, వైశాలి తదితరులు పాల్గొన్నారు.

