* ప్రజల సమస్యలను ఓపికగా విని.. బాధితులకు న్యాయం చేయడమే కాళోజీకి నిజమైన నివాళి: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
రామగుండం: ప్రజల కోసం ప్రశ్నించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు కలం పోలీసులకు స్ఫూర్తిగా నిలవాలని, ప్రజల భద్రత కోసం పనిచేసే పోలీస్ యూనిఫామ్ ప్రజల నమ్మకానికి ప్రతీకగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం సీపీ మాట్లాడుతూ.. తెలంగాణ యాస, భాషలో సామాజిక అంశాలను తన రచనల ద్వారా ప్రజలకు చేరువ చేసి, వారిలో చైతన్యం నింపిన గొప్ప ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. కాళోజీ కేవలం కవి మాత్రమే కాదని, సామాన్య ప్రజల సమస్యలను తన రచనల ద్వారా బలంగా వినిపించిన ప్రజా గొంతుకగా నిలిచారని పేర్కొన్నారు.
సామాన్యుడి భాషలో సామాన్యుడి జీవితాన్ని, సమస్యలను ప్రతిబింబిస్తూ సామాజిక అన్యాయం, అసమానతలు, దోపిడీ, నిరంకుశత్వాన్ని ప్రశ్నించే చైతన్యాన్ని కాళోజీ తన రచనల ద్వారా కలిగించారని తెలిపారు. ‘నా గొడవ’ వంటి రచనలు ఆయన ప్రజా చైతన్యానికి ప్రతీకలుగా నిలిచాయని అన్నారు. ప్రజా సేవ, సాహిత్యం, సామాజిక చైతన్యానికి కాళోజీ చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించిందని సీపీ తెలిపారు.
కాళోజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజల సమస్యలను ఓపికగా వినడం, బాధితులకు న్యాయం చేయడం, బలహీన వర్గాలకు అండగా నిలవడం, విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని సీపీ పేర్కొన్నారు.
“ప్రజల కోసం ప్రశ్నించిన కాళోజీ కలం మనకు స్ఫూర్తి అయితే.. ప్రజల భద్రత కోసం పనిచేసే మన యూనిఫామ్ ప్రజల నమ్మకానికి ప్రతీకగా నిలవాలి” అని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు మరింత చేరువగా, బాధ్యతాయుతంగా, మానవీయ దృక్పథంతో పోలీసింగ్ అందించాలని సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఏవో శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు భీమేశ్, శ్రీనివాస్, ఆర్ఐలు శేఖర్, రమేష్, సీసీ సందీప్, ఆర్ఎస్ఐలు ప్రవీణ్, శివ తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు.

