Sunday, October 4, 2026

Buy now

కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన అడుగులు

* తెలంగాణ హక్కుల పరిరక్షణే లక్ష్యం.. సబ్బండ వర్గాల సాధికారత కోసం పోరాటం

హైదరాబాద్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన ముందుకు సాగుతుందని పార్టీ సీనియర్ నాయకులు ఎల్. రూప్ సింగ్, నవీన్ ఆచారి, సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ సమాజంలో హక్కుల కోసం ప్రశ్నించే చైతన్యాన్ని కాళోజీ తన రచనలు, ఉద్యమాల ద్వారా రగిలించారని పేర్కొన్నారు. తమ ప్రాంతంపై దోపిడీకి దిగే శక్తులను ఎంతటి వారైనా ఎదురించాలనే స్ఫూర్తిని కాళోజీ ప్రజల్లో నింపారని అన్నారు.

కాళోజీ ఆలోచనా విధానానికి అనుగుణంగానే కవిత టీఆర్ఎస్‌ను స్థాపించి తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్నారని నాయకులు తెలిపారు. ప్రాంతేతరులు దోపిడీకి పాల్పడితే పొలిమేర వరకు తరిమికొట్టాలని, ప్రాంతానికి చెందినవారే దోపిడీకి పాల్పడితే వారిని ప్రాంతంలోనే అడ్డుకోవాలన్న కాళోజీ పిలుపు తమకు ఆదర్శమని పేర్కొన్నారు.

గతంలో తెలంగాణను దోపిడీ చేసిన ఆంధ్రా పాలకుల నుంచి విముక్తి సాధించామని, అయితే ప్రస్తుతం తెలంగాణకు చెందిన కొందరే ఈ ప్రాంత వనరులు, ప్రయోజనాలను దోపిడీ చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. అలాంటి దోపిడీని అడ్డుకుని సబ్బండ వర్గాలు, సకల జనుల అభివృద్ధి, సాధికారత కోసం తెలంగాణ రక్షణ సేన నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎత్తరి మారన్న, ముస్తఫా, ఆనందం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular